Ys Jagan : జగన్ చేజేతులా చేసుకుంటున్నాడే.. మారితేనే భవిష్యత్

వైఎస్ జగన్ కు రాజకీయ శత్రవులు ఎక్కువగా కనపడుతున్నారు.

Update: 2026-03-11 08:54 GMT

వైఎస్ జగన్ కు రాజకీయ శత్రవులు ఎక్కువగా కనపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్ చేజేతులా చేసుకున్నదే. రాజకీయాలు అన్న తర్వాత ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు. అధికారం ఒకరి సొంతం కాదు. అధికార మార్పిడి ఎప్పుడూ జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎన్నికకు అధికారం మారుతుంటుంది. 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన మూడు ఎన్నికల్లో ప్రభుత్వం మారుతూనే వస్తుంది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలను పూర్తిగా మార్చేశారంటున్నారు. ఆయన కక్షలు, కేసులు అంటూ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టే విధంగా పాలన చేశారని, దీంతో ఆయనకు మిత్రుల కన్నాశత్రువులే ఎక్కువగా ఈ రెండు దశాబ్దాల కాలంలో తయారయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

తండ్రికి తగ్గ తనయుడు కాదు...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ వేధింపులకు దిగలేదు. పైగా వారి పనులు కూడా చేసి పెట్టేవారు. అదే వైఎస్ కు అడ్వాంటేజీ గా రాజకీయాల్లో మారింది. ప్రతిపక్షంలో ఉన్న వారిని వైఎస్ శత్రువులుగా ఎప్పుడూ చూసేవారు కాదు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులుగా భావించి రాజకీయ విమర్శలు చేసేవారు తప్పించి, తర్వాత ఆయన పర్యటనలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం గురించి ఎక్కువ చెప్పుకునే వారు. అంతే తప్పించి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారు కాదు. కానీ జగన్ హయాం నుంచి ఆ పరిస్థితులు మారాయి. 2014 నుంచి 2019 వరకూ కూడా చంద్రబాబు అదే విధానాన్ని పాటించారు. జగన్ ను పెద్దగా రాజకీయంగా టార్గెట్ చేసేవారు కాదు.
ప్రత్యర్థులపై వేధింపులతోనే...
కానీ 2019 నుంచి జగన్ తన పాలనలో సంక్షేమంపై ఎంత ఫోకస్ పెట్టారో... ప్రత్యర్థులపై అంతే వేధింపులకు దిగడం ప్రారంభించారు. కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం కూడా జగన్ నుంచి ప్రారంభమయింది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను, అవినీతిని ఎత్తి చూపడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో తాను ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రి అన్న గుడ్డి నమ్మకంతో జగన్ చంద్రబాబును కూడా ఆ వయసులో జైలులో వేసి ఆనందం పొందడాన్ని ఏ వర్గం ప్రజలు హర్షించలేదు. అదే జగన్ కు మైనస్ పాయింట్ అయింది. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా జగన్ రాజకీయ విమర్శలవరకూ పరిమితమై.. కక్షసాధింపు అనే పదాన్ని పక్కన పెడితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నది మాత్రం వాస్తవం. లేకుంటే జగన్ వస్తే ఏదో జరుగుతుందని కొందరు వీరాభిమానులు ఊగిపోవచ్చు కానీ, ప్రజలు మాత్రం హర్షించరు. ఆ విషయం గుర్తెరిగి జగన్ వ్యవహరిస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.




Tags:    

Similar News