Ys Jagan : ఆర్థిక విధ్వంసానికి కేరాఫ్ చంద్రబాబు

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు.

Update: 2026-03-11 06:33 GMT

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాగ్ కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. సూపర్ 6 లేవు.. సూపర్ 7 లేవని.. అయినా కూడా అప్పులు లక్షల కోట్ల రూపాయలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. బడ్జెట్ లో మోసాలు, కల్పిత లెక్కలే కనిపించాయని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కాగ్ కళ్లకు కట్టినట్లు చూపించిందని చెప్పారు. తాము కరోనా సమయంలోనూ అన్ని పథకాలను అమలు చేశామని చెప్పారు.

సంక్షేమ పథకాలకూ సున్నం పెట్టి...
అసెంబ్లీ సమావేశాలు పదహారు రోజుల పాటు జరిపారని, తర్వాత అయినా ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అని జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పులు తెస్తూనే ఉన్నారన్నారు. పోనీ.. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాడా? అంటే అదీలేదన్నారు. మూడేళ్లలోనే 3.80 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను కూడా అమలు చేయడం లేదని జగన్ అన్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు చంద్రబాబు హయాంలో పెరుగుతుందని అన్నారు. ఇవి పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి కారణమని జగన్ అన్నారు.
విచ్చలవిడి అవినీతి...
అందరూ కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బినామీలు, పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, సిలికాన్, క్వార్జ్, గ్రానైట్, లిక్కర్ ను కూడా వదలకుండా దోచుకుంటున్నారని జగన్ అన్నారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. భూములను ఆక్రమించుకుంటున్నారని అన్నారు. సమీప బంధువులకు భూములను అప్పనంగా దోచిపెడుతున్నారని అన్నారు. తాము ఐదేళ్లలో ఎన్.బి.సి కంటే తక్కువగానే అప్పులు చేశామని చెప్పారు. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారో ఇప్పుడు చెప్పాలన్నారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారని? ఎవరిపై ఈ భారం మోపుతారని జగన్ ప్రశ్నించారు. ఏ కష్టాలు, విపత్కర పరిస్థితులు లేనప్పటికీ 2024 - 25లో ట్రెజరీలో కనీస నగదు మూడు రోజులు లేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారని, అప్పులు చేసిన డబ్బులన్నీ ఎటు పోతున్నాయని ప్రశ్నించారు.


Tags:    

Similar News