Tirumala : తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. నేడు దర్శనం సమయం ?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది, బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కువ కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. భక్తులు ఇబ్బందుుల పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తీవ్రత ఎక్కువ కాకముందే స్వామి వారిని దర్శించుకుని వెళితే మంచిదని యోచించి ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
అనేక మంది కొండకు...
వేసవి కాలంలో సహజంగానే తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు పూర్తయి ఇక ఫలితాలు వచ్చిన తర్వాత మరింత రద్దీ పెరుగుతుంది. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో వివాహాలు, శుభకార్యాలు పూర్తి చేసుకున్న వారు స్వామి వారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఇక సిఫార్సు లేఖలు కూడా స్వీకరించే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,747 మంది భక్తులు తమ తలనీలాలాను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.