Andhra Pradesh : అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్... నిండా మునిగేది ఎవరో?

కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి అంత కుదురుగా లేదు

Update: 2026-03-11 07:00 GMT

కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి అంత కుదురుగా లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మూడు సార్లు పనిచేసినా ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడమే. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇక అభివృద్ధి పనులను కూడా ఎప్పటికప్పుడు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ శాఖ అధికారులు కూడా దాదాపు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చినట్లు తెలిసింది. ఒకటో తేదీ వస్తుందంటే అంతకు ముందు వారం నుంచే ఆర్థిక శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

వడ్డీలు.. పథకాల అమలు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో నెలకు 2500 కోట్లు రూపాయలు దాని కోస వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలు సరే సరి. మాజీ ఉద్యోగుల పింఛన్లకే వచ్చిన ఆదాయం కూడా సరిపోతుంది. ఇక మిగిలిన సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలోనే ఏపీ అప్పులు అధికంగా చేసే రెండో రాష్ట్రంగా నిలిచింది. మొదటిది తమిళనాడు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరొకవైపు ఆదాయం పెరిగే మార్గాలు మాత్రం కనిపించడం లేదు. ఆదాయం అలాగే ఉండటం, ఖర్చులు పెరగడంతో భారీగా రెవెన్యూ లోటు కూడా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు నెలకు 5,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు వడ్డీలు కట్టాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ద్రవ్యలోటు పెరిగిపోతుంది. పరిమితులకు మించి అప్పులు చేయటం వలన పరపతి తగ్గిపోతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టే పరిస్థితి పోవాలంటే ఆర్థిక పరంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. నేరుగా నగదు బదిలీ రూపంలో సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన తరువాత, అవి ఆపటం అనేది అసాధ్యం. పన్నులు పెంచటం అసాధ్యం. ఉపాధి అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆశించినంత మేరకు ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్పులు తెస్తూ కాలం గడపాల్సి వస్తుంది. అప్పుల భారం ప్రజలపై భవిష్యత్ లో పడుతుందన్న ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుంటే ఏపీ భవిష్యత్ అంధకారమేనన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News