Pawan Kalyan : పవన్ తెలిసే అలా మాట్లాడుతున్నారా? మీరు కలసి ఉంటే సరిపోతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అంతా తెలిసీ తెలియనట్లే వ్యవహరిస్తున్నట్లుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అంతా తెలిసీ తెలియనట్లే వ్యవహరిస్తున్నట్లుంది. కూటమి పార్టీలో కింది స్థాయి నేతల్లో సఖ్యత లేదని ఆయన గ్రహించారు. అయితే వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయకపోగా, తాను, చంద్రబాబు ఇప్పటికీ, ఎప్పటికీ సఖ్యతగానే ఉంటామని, తాము అరమరికలు లేకుండా మాట్లాడుకుంటామని, మీరు కూడా కూటమి పది కాలాల పాటు పటిష్టంగా ఉండేలా చూడాలని చెబుతున్నారు. ఈ మాట పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనూ కూటమి నేతల మధ్య, క్యాడర్ మధ్య గ్యాప్ ఉందని ఆయనకు తెలుసు. ఇందుకోసం ఆయన ఫైవ్ మెన్ కమిటీని నియమించారు. ఏ సమస్య అయినా పరిష్కరించుకునేందుకు ఈ ఐదుగురు నేతలు ప్రయత్నిస్తున్నారు.
నేతల మద్య విభేదాలు...
అలాగని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య విభేదాలున్నాయి. టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. జనసేన కేవలం 21 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలంటే లెక్కలో పెద్ద అంకె కాదన్నది అందరికీ తెలుసు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాలు మాత్రమే కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య నెలకొన్న విభేదాలను గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ఎప్పటిలాగానే ఆ రెండు జిల్లాలకే పరిమితమయి తన రాజకీయాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ తరచూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అప్పుడప్పుడు గిరిజన ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు.
సమన్వయ కమిటీలు ఎక్కడ?
కూటమి నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి ఎన్నికల ముందు నుంచే అన్ని పార్టీలతో కలసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో మరొక సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్లవుతున్నప్పటికీ ఈ జిల్లా సమన్వయ కమిటీ కానీ, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ కానీ కలసి కూర్చుని చర్చించలేదు. విభేదాలపై దృష్టి పెట్టలేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పవన్ కల్యాణ్ అనుకుంటూ ఉండవచ్చు. కానీ అప్పటికి నేతల మధ్య గ్యాప్ పెరిగి పూడ్చలేనంతగా తయారవుతుందని, మొగ్గలోనే విభేదాలను తుంచేస్తే కూటమి పదికాలాల పాటు పదిలంగా ఉంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. గ్యాప్ పెరిగే కొద్దీ పార్టీని వీడే వారి సంఖ్య కూడా ఎక్కువవుతుందన్న విషయాన్ని గ్రహిస్తే మంచిది.