Summer Effect : ఈ సారి టెంపరేచర్స్ రికార్డ్ బ్రేక్ చేస్తాయట.. ఎన్ని డిగ్రీలంటే?

ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో ఉష్ణోగ్రతలుపెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Update: 2026-03-01 04:02 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం మారుతుందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలోనూ పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

మార్చి నెలలోనే...
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్టంగా మార్చి నెలలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం కొంత చలి వాతావరణం ఉన్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప పగటి వేళ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు బ్రేక్ చేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
తెలంగాణలోనూ గరిష్టంగానే...
తెలంగాణలోనూ గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి నెల నుంచి జూన్ నెల వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు నమోదవుతున్నాయని, మరికొద్ది రోజుల్లోనే నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలకు చేరుకునే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు. మూడు నెలల పాటు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.భానుడి భగభగలతో ఇప్పటికే తెలంగాణలో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, మహబూబ్ నగర్,వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనాలున్నాయి.


Tags:    

Similar News