Tirumala : తిరుమలకు రెండు రోజులు వెళ్లకపోవడమే మంచిది.. రీజన్ ఇదే
తిరుమలలో పెరిగిన నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో పెరిగిన నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తులు మరింతగా పెరిగారు. భక్తుల సంఖ్య గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగానే కొనసాగుతుంది. గంటల కొద్దీ శ్రీవారి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లు రెండు రోజులుగా నిండిపోతున్నాయి. వేసవి కాలం కావడంతో భక్తులు క్యూ లైన్ లలో ఇబ్బందులు పడకుండా శ్రీవారి సేవకుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్నప్రసాదం, మజ్జిగ, పాలు, పంపిణీ చేస్తున్నారు.
ఎస్.ఎస్.డి. టోకెన్లు నిలిపివేత...
తిరుమలలో చంద్రగ్రహణం ఎఫెక్ట్ కనపడుతుంది. ఈ నెల 3వ తేదీన చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని గంటల సమయం మూసివేస్తారు. అందుకే ఈరోజు తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు ఎస్.ఎస్.డి. టోకెన్ల జారీని టీటీడీ అధికారులు రద్దు చేశారు. మార్చి 3న వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. తిరిగి మార్చి 4న దర్శనానికి 3వతేదీన ఎస్.ఎస్.డి టోకెన్లు జారీచేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,240 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.