TDP : లోకేశ్ పిలుపు మేరకు మళ్లీ ఆయన ఎంట్రీ ఇస్తున్నారటగా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త అవసరాన్ని అన్ని పార్టీలూ గుర్తించాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త అవసరాన్ని అన్ని పార్టీలూ గుర్తించాయి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. నాడు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అయితే అదే సమయంలో ఎన్నికలకు వ్యూహకర్తలు అవసరమా? అని నాడు ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల కోసం తాను కూడా ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారు. రాబిన్ శర్మ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. మరి రాబిన్ శర్మ ప్రభావమో.. కూటమి వల్లనో.. లేక నాటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లనో తెలియదు కానీ మొన్నటి ఎన్నికలలో కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది.
సోషల్ మీడియా వల్ల కాకపోవడంతో...
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ సోషల్ మీడియాను నమ్ముకున్న చంద్రబాబుకు అది సక్రమంగా వ్యవహరిచడం లేదని అర్థమయింది. ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగడంలోనూ, ప్రతిపక్ష పార్టీల విమర్శలను సూటిగా తిప్పికొట్టడంలోనూ పెద్దగా పార్టీ సోషల్ మీడియా వల్ల కావడం లేదని పార్టీ నాయకత్వం గుర్తించినట్లు కనపడుతుంది. అందుకే 2024 ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మళ్లీ రాబిన్ శర్మ అవసరం ఏర్పడిందని భావిస్తుంది. ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై...
ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో వచ్చే ఎన్నికల్లోనూ సర్వేల ద్వారా రాబిన్ శర్మ గుర్తించి పార్టీ నాయకత్వానికి జాబితాను అందించేలా సహకరించేందుకు రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు నలభై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని పార్టీ కేంద్ర నాయకత్వమే నివేదికలు అందించింది. కేవలం పార్టీ నుంచి కాకుండా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా అయితే ఖచ్చితమైన సమాచారం అందుతుందని భావించిన పార్టీ నాయకత్వం త్వరలోనే రాబిన్ శర్మ టీంను రంగంలోకి దించేందుకు సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మను రంగంలోకి దించి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, అప్పటికీ ఎన్నికల నాటికి వైఖరి మార్చుకోకుంటే వారికి ప్రత్యామ్నాయం కూడా ఆ టీం సూచించే విధంగా ప్లాన్ రెడీ చేస్తున్నారు.