Nandamuri Bala krishna : బాలయ్య అమరావతికి దూరం అవుతున్నారా? పెట్టారా?
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొంత ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతుంది
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొంత ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతుంది. ఆయన హిందూపురం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఏదీ మనసులో ఉంచుకోరు. అది శాసనసభ అయినా.. బహిరంగ సభ అయినా ఆయనకు ఒక్కటే. తాను అనుకున్నది బయటకు చెప్పేయడమే బాలకృష్ణకు అలవాటు. అదే అనేక సార్లు రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. గత నవంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని పార్టీలను షేక్ చేశాయి.
ఆ వివాదం తర్వాత...
శాసనసభలో చిరంజీవిని ప్రస్తావన తెచ్చి టీడీపీ నాయకత్వానికి ఇబ్బందిగా మారారు. . ఇక అదే సమయంలో దీనిపై ఎవరు ఎంత రచ్చ చేసినా ఆయన నోటి నుంచి ఎటువంటి క్షమాపణ అన్న పదం రాలేదు. అందుకే నాడు చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఏపీ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు విజయవాడ కు రావడమే మానేశారు. తనకు ఏదైనా పనులు ఉన్నా హిందూపురం నియోజకవర్గంలో సమస్యలున్నా నేరుగా చంద్రబాబుకో, లోకేశ్ కో ఫోన్ చేసి పరిష్కరించుకుంటున్నారు కానీ అమరావతిలో మాత్రం అడుగు పెట్టలేదు.
నియంత్రించలేరు కానీ...
ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన నందమూరి బాలకృష్ణ నివాళులర్పించి కేవలం ఎన్టీఆర్ గురించి నాలుగు మంచి మాటలు మీడియాతో మాట్లాడారు. అంతకు మించి రాజకీయాల జోలికి ఆయన వెళ్లలేదు. ప్రతిసారీ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడే నందమూరి బాలకృష్ణ ఈసారి మాత్రం ఆ పనిచేయకపోవడంపై అందరిలోనూ చర్చ మొదలయింది. నందమూరి బాలకృష్ణను పార్టీ నాయకత్వం దూరంగా ఉండాలని చెప్పిందని అనుకోలేం. ఎందుకంటే బాలకృష్ణను అలా నియంత్రించలేరు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం మౌనంగా ఉండటం వెనక ఏదో ఒకటి జరిగి ఉంటుందన్న ప్రచారం బాలయ్య బాబు ఫ్యాన్స్ లో అనుమానం కలుగుతుంది. ఇంతకీ లెజెండ్ సైలెన్స్ వెనక సినిమా షూటింగ్ లే కారణమా? లేక తన మాట కూటమి ప్రభుత్వంలో చెల్లుబాటు కావడం లేదన్న అసహనమా? అన్న చర్చ జరుగుతుంది.