Nara Lokesh : ముహూర్తం ఫిక్స్...లోకేశ్ కు ఆ పదవి ఇచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పట్టాభిషేకానికి ముహూర్తం రెడీ అయింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పట్టాభిషేకానికి ముహూర్తం రెడీ అయిందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి గా నారా లోకేశ్ ను వచ్చే ఏడాది చేయాలని అంతా సిద్ధం చేస్తున్నట్లు పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలోనూ ఈ మేరకు బీజేపీ కే్ంద్ర పెద్దలతో ఈ విషయం చర్చించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ భావినేతగా నారా లోకేశ్ ఇటు క్యాడర్ లోనూ, అటు నేతల్లోనూ ఫిక్సయిపోయారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టే దెప్పుడు అన్న దానిపైనే జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పదవి అన్న ప్రచారం జరిగినా దానిని కొట్టిపారేస్తూ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయంలో నారా కుటుంబం ఉందని తెలిసింది.
ఇప్పటికే పట్టు సంపాదించుకుని...
నారా లోకేశ్ పార్టీపైనా, ప్రభుత్వంపైన ఇప్పటికే పట్టు సంపాదించుకున్నారు. ఆయన విద్య, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నప్పటికీ అన్ని శాఖల బాధ్యతను నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తో సమానంగా పర్యటిస్తూ కేంద్రమంత్రులను, బీజేపీ పెద్దలను తరచూ కలసి వస్తున్నారు. నారా లోకేశ్ ఎప్పటికైనా ఈ పదవి ఇవ్వడం తప్పదు. టీడీపీ క్యాడర్ అభిప్రాయం కూడా అదే. అయితే చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు నారా లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేద్దామని భావించినప్పటికీ కొన్ని కారణాలతో వచ్చే ఏడాది.. అంటే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు ముందుగానే ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ ను చేయాలని నారా కుటుంబం ఫిక్సయినట్లు వార్తలొస్తున్నాయి.
ఎన్నికలకు ముందే...
తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేదు. 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయింది. అందుకే ఈసారి నారా లోకేశ్ ను ముందుగానే ముఖ్యమంత్రిని చేసి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో చంద్రబాబు కూడా ఉన్నారని తెలిసింది. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతుంది. అందుకే మంత్రి వర్గ సమావేశానికి ముందు టీడీపీకి చెందిన మంత్రులతోనూ, పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు సభ్యులతో నారా లోకేశ్ సమావేశమయి వారికి దిశానిర్దేశం చేయడం కూడా ఆ ఆలోచనల్లో భాగమేనని అంటున్నారు. ముందుగా మంత్రివర్గ విస్తరణ చేయడంతో పాటు జగన్ పాదయాత్ర ప్రారంభం కాకముందే నారా లోకేశ్ ను ముఖ్యమంత్రి పదవి పై కూర్చోబెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు బలంగా అమరావతిలోనూ టాక్ వినిపిస్తుంది. మరి ఇది ప్రచారమా? లేక నిజంగా జరుగుతుందా? అన్నది చూడాలంటే మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.