Kolikapudi : కొలికపూడికి సీనియర్లు సలహాలివ్వాలట.. ఆయనకు అనుభవం లేదట

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారు

Update: 2026-02-12 08:53 GMT

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారు. ఆయన తన స్టేటస్ గా పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకన్నారు. దీంతో అసెంబ్లీ లాబీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఇక ఉపేక్షించే అవకాశం లేదని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోతే ఎలా? అని పల్లా శ్రీనివాస్ కొలికపూడి శ్రీనివాసరావును ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలోనూ పరోక్షంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరయి వివరణ ఇచ్చినా మార్పు రాలేదని పల్లా అన్నారని తెలిసింది.

వరస వివాదాలతో...
కొంతకాలం క్రితం కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రచ్చ కెక్కింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కొలికపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చర్యలు తీసుకోకుంటే కొలికపూడి నుంచి సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మరింత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని భావిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు ను అందుకే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీల్లోనే హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా త్వరలో పిలుపు వచ్చే అవకాశముంది.
కూటమి సర్కార్ వైఫల్యంపై పరోక్షంగా...
తాజాగా ఆయన వాట్సాప్ లో పెట్టుకున్న స్టేటస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. మూడు రోజుల్లో తాను ముప్ఫయి ఐదు గ్రామాలను పర్యటించానని, 485 కుటుంబాలతో ఆత్మీయ కలయికను చేపట్టినట్లు స్టేటస్ లో తెలిపారు. ఇంతటి తో ఆగకుండా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు.. పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో కొలికపూడికి ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేదని, ఏదో ఒక చర్య తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమైన బాధ్యతలు వేరే వారికి పార్టీకి అప్పగించడం కూడా ఆయనలో ఆగ్రహానికి కారణమంటున్నారు. అయితే అనుభవరాహిత్యంతోనే తాను ఇలాంటి పోస్టులు పెడుతున్నానని, సీనియర్లు తనకు మార్గనిర్దేశనం చేయాలని పల్లా శ్రీనివాస్ తో చెప్పినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉన్నత చదువులు చదివిన కొలికపూడికి సీనియర్ల సలహా అవసరమా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News