Rain Alert : అకాల వర్షాలు మరికొన్ని రోజులు... ఎప్పటిదాకా అంటే?

రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-10-11 05:05 GMT

రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంబలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న వారం రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. అక్టోబరు నెల మధ్యలోకి వస్తున్నా ఇప్పటికీ వానలు పడటానికి కారణం వాతావరణంలో మార్పులేనని అంటున్నారు. ఇవి అకాల వర్షాలని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ అక్టోబరు నెలలో వర్షాలు కురవని, నవంబరు నెలలో తుపానులు వస్తాయని, కానీ ఆగస్టు నెలలో ప్రారంభమయిన వానలు ఇప్పటి వరకూ ఆగకపోవడానికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులేనంటున్నారు.

ఏపీలో ఈ ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నంలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. రాయలసీమలో మాత్రం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణలో వారం పాటు...
తెలంగాణలోనూ వారం రోజుల పాటు భారీవర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశముందని, ఈ ప్రభావంతో్ తెలంగాణలోని కుండపోత వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.


Similar News