Nellore : వేడెక్కిన సింహపురి రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Update: 2025-12-12 07:53 GMT

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ, టీడీపీ నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాగైనా నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాసం కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లున్నారు. అందులో అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత నలభై మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ ను పక్కన పెడితే టీడీపీకి ముప్ఫయి ఆరు మంది సభ్యుల బలం ఉంది. మరొకవైపు వైసీపీ కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో ఐదుగురు చేరడంతో వీరి సంఖ్య పదహారుకు చేరుకుంది.

విశ్వాసం వీగిపోవాలంటే?
అయితే వైసీపీకి ఇరవై మంది సభ్యులుంటే మేయర్ స్రవంతిపై పెట్టిన విశ్వాసం వీగిపోతుంది. అందుకోసం మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రంగా గతంలో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీకి మారడంతో వారికి గాలం వేస్తున్నారు. తిరిగి వైసీపీలోకి వస్తే ఈసారి జరిగే ఎన్నికల్లోనూ కార్పొరేటర్ గా టిక్కెట్ ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. అందుకోసమే ఐదు గురు సభ్యులు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీలోకి వెళ్లిన ఐదుగురిలో ఓబుల రవిచంద్రపై పోలీసు కేసు నమోదు కావడంతో తిరిగి ఆయన తాను టీడీపీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీలోకి వచ్చిన వారిపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
క్యాంప్ రాజకీయాలు...
మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వద్ద ఉన్న కార్పొరేటర్లను క్యాంప్ నకు తరలించినట్లు తెలిసింది. అందరినీ ఒకచోట ఉంచి ఇక ఎవరూ చేజారకుండా ఉండేలా కోటంరెడ్డి క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. పద్దెనిమిదో తేదీన మేయర్ స్రవంతిపై అవిశ్వాసం నెగ్గితే మరొకరిని మేయర్ గా ఎంపిక చేయడానికి ప్లాన్ చేశారు. అయితే వైసీపీ కూడా కోటంరెడ్డి ప్లాన్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యేలా కనిపిస్తుంది. కార్పొరేటర్ల బంధువులను సంప్రదించి వారిని బుజ్జగించేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో సింహపురి రాజకీయం మరోసారి హీటెక్కిందనే చెప్పాలి. నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ పీక్స్ కు చేరుకుంది.


Tags:    

Similar News