Jana Sena : నాగబాబు ఇక అలా ఉండి పోవాల్సిందేనా? మోకాలడ్డిందెవరు?
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఏడాదవుతుంది.
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఏడాదవుతుంది. గత ఏడాది డిసెంబరు 9వ తేదీన ఈ ప్రకటన విడుదలయింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో అది నాగబాబుకేనని జనసేన నేతలు ఫిక్స్ అయ్యారు. కానీ ఏడాది నుంచి నాగబాబు మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో నాగబాబు కూడా పెద్దగా యాక్టివ్ గా పాలిటిక్స్ లో కనిపించడం లేదంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు. మీడియా సమావేశంలోనే వారు వివరించారు.
పదవి దక్కకపోవడానికి...
కానీ ఏడాది గడుస్తున్నా నాగబాబుకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం పవన్ కల్యాణ్ మాత్రమేనని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ క్లారిటీ కూడా ఇచ్చారు. తానే మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేవిషయంపై ఇప్పటి వరకూ చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, కానీ తాను మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నానని చెప్పడంతో పవన్ కల్యాణ్ నిర్ణయం వవల్లనే నాగబాబుకు మంత్రి పదవి ఆగిందని అనుకోవాలి. ఆగస్టులో ఉండవచ్చని పవన్ కల్యాణ్ అప్పుడే చెప్పినా ఆగస్టు ముగిసి నాలుగు నెలలవుతున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ఎమ్మెల్సీగానే కొనసాగుతారని...
ఇక నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. కుటుంబంలోని వారికే పదవులు ఇస్తున్నారని, ఒకే సామాజికవర్గానికి పదవులను పంచుతున్నారన్న విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ వెనకడగువేస్తున్నారంటున్నారు. . ఇప్పటికే జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులుంటే అందులో ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారే. శాసనమండలిలో ఉన్న ఇద్దరు కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక మరో మంత్రి పదవి కూడా కాపు సామాజికవర్గానికి ఇస్తే తనపై కుల ముద్ర పడుతుందేమోనని పవన్ కల్యాణ్ ఆలోచనలో పడి నాగబాబుకు మోకాలడ్డినట్లు అంటున్నారు. మరొకవైపు నాగబాబు అవసరం పార్టీకి ఉంటుందని కూడా పవన్ కల్యాణ్ అభిప్రాయపడుతున్నారు. అందుకే నాగబాబు ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సిందేనని జనసేన వర్గాలే చెబుతున్నాయి.