Andhra Pradesh : ఏపీ వాసులకు అలెర్ట్.. ఇలాగయితే మీ రేషన్ కార్డులు రద్దయినట్లే
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులను అందుకునేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులను అందుకునేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది. ఈ నెల 15వ తేదీతో రేషన్ స్మార్ట్ కార్డులను తీసుకునేందుకు అవకాశం ముగియనుంది. అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అర్హులైన వారందరూ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే కొందరు ఇప్పటికే రేషన్ కార్డులను తీసుకున్నప్పటికీ చాలా మంది ఇంకా కొత్త రేషన్ కార్డులను అందుకోలేదని పౌర సరఫరాల శాఖకు అందుతునన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కొత్త రేషన్ కార్డులు పొందడానికి...
రేషన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేసింది. క్యూ ఆర్ కోడ్ ద్వారా రేషన్ సరుకులను అందుకునే వీలు కల్పించింది. రేషన్ పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు ఈ స్మార్ట్ కార్డులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్దిదారులకు మాత్రం అందేందుకు వీలుగానే ఈ కొత్త రేషన్ కార్డులను అమలులోకి తెచ్చారు. గతంలో నకిలీ రేషన్ కార్డులను కూడా తొలగించారు. అనర్హులను తొలగించి అసలైన అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం రేషన్ అందించేలా ఈ స్మార్ట్ కార్డును తీసుకు వచ్చింది.
కార్డు తీసుకోకుంటే...
ఈ స్మార్ట్ రేషన్ కార్డులను సంబంధిత రేషన్ దుకాణాల నుంచి లబ్దిదారులు అందుకోవాల్సి ఉంది. ఇందుకు ఈ నెల 15వ తేదీ చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మాత్రమే రేషన్ సరుకులను అందించనున్నారు. ఆదివారం రేషన్ దుకాణాలకు సెలవు కావడంతో మూడు రోజులు మాత్రమే ఇక కొత్త రేషన్ కార్డులు అందుకోవడానికి గడువు ఉంది. కొత్త స్మార్ట్ కార్డులు గడువులోగా తీసుకోకపోతే తాము పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తిరిగి పంపించి వేస్తామని చెబుతున్నారు. హోం డెలివరీ చేయాలంటే ఒక్కొక్క స్మార్ట్ కార్డుకు రెండు వందల చెల్లించి కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. గడువులోపలయితే ఉచితంగా తీసుకునే వీలుంది. హోం డెలివరీకి కూడా ముందుకు రాకుంటే కార్డులను రద్దు చేస్తారు. అందుకే వెంటనే రేషన్ దుకాణాలకు వచ్చి తమ స్మార్ట్ కార్డులను ఈ మూడు రోజుల్లో తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు.