Ys Jagan : వైఎస్ జగన్ పై కేసు నమోదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2025-02-20 04:27 GMT

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున...
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జగన్‌ ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించారని, ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీసు యాక్ట్‌ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారని, దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News