Andhra Pradesh : అయ్యన్నకు మద్దతు పెరుగుతుందా? చంద్రబాబుపై వత్తిడి వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. శాసనసభ స్పీకర్ గా ఆయన మంచి పదవిలోనే ఉన్నారు. అయితే స్పీకర్ పదవిలో కంటే అయ్యన్నపాత్రుడు మంత్రిపదవిలో ఉంటేనే పార్టీకి మంచిదన్న అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి టీడీపీ నాయకత్వానికి ఎక్కువగా అందుతున్నాయి. తెలుగుదేశ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అదీ విశాఖ ప్రాంతం కోటా కింద ఖచ్చితంగా అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి దక్కుతుంది. కానీ ఈసారి సీనియర్ నేతలకు అవకాశం దక్కకపోవడంతో అయ్యన్నను అవమానించడం ఇష్టలేని నాయకత్వం శాసనసభ స్పీకర్ గా ఎంపిక చేసింది.
పదిహేను నెలలవుతున్నా...
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ మంత్రులు పనితీరు సరిగా లేదని అధినాయకత్వం కూడా భావిస్తుంది. మంత్రి వర్గ సమావేశాల సందర్భంగా ప్రతి సారీ చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడు లాంటి వారికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. 2019 నుంచి 2024 వరకూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమయంలోనూ అయ్యన్నపాత్రుడు యాక్టివ్ గా ఉన్నారు. నాటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైనా, ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసేవారు. అందుకే అయన్న పాత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ కు బాగా దగ్గరయ్యారు. ఆయన కేసులను కూడా ఎదుర్కొన్నారు.
దీటుగా సమాధానం చెప్పక...
ప్రస్తుతం టీడీపీ మంత్రులు విపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు ధాటిగా సమాధానం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఇటు పార్టీ నాయకత్వంలోనూ, అటు క్యాడర్ లోనూ ఉంది. సీనియర్ నేతలైనా పార్టీకి ప్రయోజనకరంగా ఉండే, కటువుగా విమర్శలకు కౌంటర్ చేసే వారిని కేబినెట్ లోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయనకు ఉన్న అనుభవం కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. స్పీకర్ గా ఉండి కూడా కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటూ హార్ష్ కామెంట్స్ చేస్తున్న అయ్యన్న పాత్రుడికి తెలుగుదేశం పార్టీలోని క్యాడర్ నుంచి విపరీతంగా మద్దతు పెరుగుతుంది. అయితే మంత్రి వర్గంలోకి తీసుకోవడమా? లేదా? అన్న నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది కావడంతో ఆయనకే ఈ వినతిని చేస్తున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుదన్నది చూడాలి.