Weather Report : ఒక్కసారిగా కూల్ అయిన తెలుగు రాష్ట్రాలు.. ఎప్పటి వరకూ అంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.

Update: 2026-02-24 04:11 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. ఎండల తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్ లోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. దీంతో ఫిబ్రవరి నెల నుంచి కొంత వేడి వాతావరణం కనిపించినా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగానే ఈ వానలు పడతాయని, రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పంట ఉత్పత్తులను రక్షించుకోవాలని కూడా సూచించింది.

ఒక్కసారిగా మారిన వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లోనూ వాతావరణం ఒక్కసారి కూల్ అయింది. మూడు రోజుల పాటు వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీన పడే అవకాశముందని కూడా చెప్పింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ, కోస్తాంధ్రలలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలుపడతాయని పేర్కొంది. అలాగే ఈ రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...
తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి కారణంగానే ఈ అకాల వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తేలికపాటి వానలు మాత్రమే పడతాయని, ఎక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఎండాకాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News