Jana Sena : కుర్చీ ఇవ్వడం లేదటయ్యా.. కూటమి ధర్మం ఇదేనా సామీ?

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మరో పదిహేనేళ్లు కలసి ఉంటామని చెబుతున్నారు

Update: 2026-02-23 08:00 GMT

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మరో పదిహేనేళ్లు కలసి ఉంటామని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జనసేన నేతలకు ప్రాధాన్యత నియోజకవర్గాల్లో దక్కడం లేదు. చివరకు లభించిన నామినేటెడ్ పోస్టులు కూడా తీసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు మోకాలడ్డుతున్నారన్న విమర్శలు ఆ పార్టీ నుంచి వినపడుతున్నాయి. నామినేటెడ్ పదవులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రం జనసేన నేతలు పదవుల ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇది జనసేన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో తమ ఆవేదనను జసనైనికులు వెళ్లగక్కుతున్నారు.

నామినేటెడ్ పోస్టులపై...
పార్టీ సభ్యత్వాలపై పెట్టిన శ్రద్ధ నామినేటెడ్ పోస్టులను జనసేన నేతలకు దక్కడం పై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మైలేరి సురేఖ పేరును ప్రకటించారు. అయితే ఆమె ఏఎంసీ చైర్మన్ పదవి బాధ్యతను ఇప్పటివరకూ తీసుకోలేదు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తెలిసి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. కనీసం రాష్ట్ర స్థాయి నేతలయినా తమ పార్టీకి కేటాయించిన నామినేటెడ్ పదవులలో నియమించిన వారు బాధ్యతలు చేపట్టారా? లేదా? అన్నది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కేటాయించిన చైర్మన్ పదవిలో కూర్చోకుండా చేస్తున్నారు అంటే రేపు తిరిగి జనసేన కూటమి కోసం ఎలా పని చేయగలుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేకు ఇష్టం లేకపోతే...
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు జనసేన నేతను ఆ కుర్చీలో కూర్చోబెట్టడం ఇష్టంలేకనే దానిని వాయిదా వేస్తున్నారంటూ జనసేన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. తాను ఎవరికో ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం జనసేనకు ఇచ్చిన పదవికి అడ్డం పడటమేమిటని వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇలాగే ఉంటే ఈ ప్రాంతంలో కూటమి నేతల మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. గ్రౌండ్ రియాలిటీలో జనసేనకు ఉపయోగపడకపోతే రేపు క్యాడర్ మన కోసం ఎందుకు నిలబడతారు అనే ఆలోచన అసలు జనసేన పార్టీలో ఉందా?అని ప్రశ్న జనసేన నేతల నుంచి వస్తుంది. నెలల వరకు కూడా సీట్లో కూర్చోకుండా అడ్డుకుంటున్నారు అంటే జనసేనకు ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదంటున్నారు. ఇలాంటి వాటి కోసమేనా పార్టీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేసి చివరికి ఏం సాధించినట్లు? ఆళ్లగడ్డలో బలంగా ఉన్న జనసేన రేపు ఎవరి కోసం నిలబడాలి ఏ పార్టీ కోసం నిలబడాలి? జనసైనికులకి ఏమి భరోసా ఇవ్వగలుగుతున్నారు? అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.


Tags:    

Similar News