Ys Jagan : జగన్ మారలేదా? వైసీపీ నేతలు ఏమంటున్నారో తెలుసా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కూడా ఏ మాత్రం మారడం లేదు.

Update: 2026-02-23 08:55 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కూడా ఏ మాత్రం మారడం లేదు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలన్న ధ్యాస లేదు. పాదయాత్ర చేస్తాం కదా? అప్పుడు తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు తప్పించి నిత్యం జనంలో ఉండేందుకు ఆయన రెండేళ్ల నుంచి ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. మధ్యమధ్యలో వచ్చి కొన్ని సమస్యలపై నేరుగా స్పందిస్తూ.. హాజరవుతున్నా .. ప్రస్తుత రాజకీయాల్లో అది సరిపోదని అంటున్నారు. రాజకీయంలో ప్రజలతో నేరుగా ఉండే సంబంధమే నాయకుడిని ఎక్కువ కాలం నిలబెడుతుందన్న విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారు. అది జగన్ విషయంలో కొద్దిగా కాదు పూర్తిగా లోపించిందని చెప్పాల్సి ఉంటుంది.

వైఎస్ తనయుడిగా...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో పదేళ్ల పాటు ఉన్నా నిత్యం ప్రజల్లో ఉండేవారు. ప్రజల నాడిని పట్టడంలో అందుకే వైఎస్సార్ సక్సెస్ అయి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. జగన్ మాత్రం రాజకీయాలను ఒక 'గణితం'లా చూస్తున్నారని అభిప్రాయం విశ్లేషకులు సయితం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకముందు చేసిన ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చూసి అందరూ ఆయన తన తండ్రి కంటే ఎక్కువగా జనంలో ఉంటారని భావించారు. కానీ,ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్ "రచ్చబండ అంటూ ప్రజల వద్దకు పాలన" అని నమ్మేవారు. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడి, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే చొరవ చూపేవారు. అప్యాయతతో పలకరించడం చేసేవారు. జగన్ మాత్రం "ప్రజల వద్దకు బటన్" అనే సిద్ధాంతాన్ని నమ్మారు. తాను బయటకు వెళ్లడం కంటే, పథకం నేరుగా లబ్ధిదారుడి ఇంటికి చేరితే చాలు అనుకున్నారు. ఇది లబ్ధిదారులను సంతోషపెట్టినా, సామాన్య ప్రజలకు ఆయన అందనంత దూరంగా ఉండిపోయారు. చివరికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు కూడా అందుబాటులో లేకుండా అధకారాన్ని దూరం చేసుకున్నారు.
సీనియర్లతో చర్చలేవీ?
వైఎస్సార్ తన హయాంలో సీనియర్ మంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. జగన్ మాత్రం మంత్రులు ఉన్నా, వారంతా కేవలం అలంకారప్రాయంగానే ఉండేవారు. అంతా తాడేపల్లి పార్టీ కేంద కార్యాలయం నుంచే నిర్ణయాలు జరిగేవి. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తికి లోనయ్యారు. ఎవరైనా సమస్య చెబితే వినే పరిస్థితి లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. జగన్ తాడేపల్లి ఇంటి గడప దాటి బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం సలహాదారులేనని చెప్పకతప్పదు. ​ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది. వారు బయట జరుగుతున్న అసలు వాస్తవాలను ఆయన వరకు చేరనివ్వలేదని నాతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటారు. అతివిశ్వాసం ఆయన్ను జనంలోకి వెళ్లకుండా చేసింది. జగన్ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించారు. కానీ వారి మనసులను గెలచుకునే ప్రయత్నం చేయలేదన్నది వాస్తవం. ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి జనంలోకి రావాలని నేతలు, క్యాడర్ కోరుకుంటుంది. మరి జగన్ సారూ వింటున్నావా? అదీ సంగతి.




Tags:    

Similar News