Chandrababu : గెలిచి ఆనందం లేని చంద్రబాబు.. ఓడి సంతోషంగా ఉన్న జగన్ నిజమేనా?
మొన్నటి ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది. ఓడి జగన్ ఆనందంగా ఉన్నారనిపిస్తోంది
మొన్నటి ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది. ఓడి జగన్ ఆనందంగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాలు తెలిసిన వారు ఎవరైనా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఖజానాలో ఉన్న సొమ్ములు చూస్తే ఓడిపోయి జగన్ ఖుషీగా ఉన్నారని చెప్పకతప్పదు. అదే గెలిచి చంద్రబాబు ఆనందంగా ఎంత మాత్రం లేరని కూడా అంతే రీతిలో చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితి ఏపీలో ఏ పార్టీ నేతలకు లేదు. ఎవరి ఇబ్బందులు వారివి. పార్టీకి రాజకీయంగా ప్రయోజనం దక్కాలంటే బీజేపీతో కలసి నడవక తప్పని పరిస్థితి చంద్రబాబుది. అలాగే వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా దాదాపు అంతే. బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి జగన్ కు లేదు.
నిధులులేక...
ఇదంతా ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సరిపోవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల నిధుల అవసరమవుతుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలాగోలా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నా ఇది ప్రభుత్వానికి ఏడాదికి ఏడాది భారం పెరుగుతూనే ఉంటుంది. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఇరవై వేలు, తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇక మహిళల ఉచిత బస్సు ప్రయాణం కూడా నెలకు వందల కోట్ల మోపు కానుంది.
అర్హుల జాబితాలో...
అందుకే అర్హుల జాబితాల్లో కోతలు విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలయినంత ఆర్థిక భారం తగ్గించుకుంటే గాని సర్కార్ బండి ముందుకు నడవదు. మరోవైపు గుదిబండలా అమరావతి, పోలవరం నిర్మాణ పనులు ఉన్నాయి. ఈరెండు పనులు పూర్తి కావాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ప్రపంచబ్యాంకు నుంచో కేంద్ర ప్రభుత్వం హామీతో కొంత నిధులు వచ్చినప్పటికీ పై మూడు పథకాల్లో అర్హుల జాబితా పెరిగిందంటే మాత్రం మరింత ఎక్కువగా భారం పడుతుంది. అందుకే ఈ మూడు పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపికలో భారీగా స్క్రూటినీ ఉంటుందంటున్నారు. ఇప్పటికే అనర్హులకు పింఛన్లు అందుతున్నాయని ఏరివేత ప్రతి నెల జరుగుతుంది.
మరికొన్ని హామీలు...
పర్ సపోజ్ ఈ మూడు ఎలాగోలా అమలు చేశారనుకున్నా ఇక మిగిలిన హామీలు అమలు చేయడం ఇపట్లో సాధ్యమయ్యే పనికాదు. బీసీలకు యాభై ఏళ్లకే పింఛను, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి వంటివి అమలు చేయాలంటే సాధ్యమయ్యే పనికాదన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఒకవేళ ఏదో ఒక రీతిలో ఇచ్చే ప్రయత్నం చేసినా అది వికటిస్తుందే కానీ ఫలించదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలా మొత్తం మీద చంద్రబాబు గెలిచి ఆనందంగా లేకపోగా, జగన్ ఓడి పోయి సంతోషంగా ఉన్నారన్న ఒక పొలిటికల్ అనలిస్ట్ కామెంట్ కరెక్టేనని అనుకోవాల్సి ఉంటుంది.