Chandrababu : బాబు అనుభవానికి ఈసారి చెదలు పడతాయా?

చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఈసారి మాత్రం సాధ్యపడటం లేదనిపిస్తుంది.

Update: 2026-01-02 06:51 GMT

చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఈసారి మాత్రం సాధ్యపడటం లేదనిపిస్తుంది. విభజన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు. కత్తిమీద సాము చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతి నిర్ణయాలు ఆయన అనుభవానికి చెదలు పట్టించేలా కనిపిస్తున్నాయి. ఒక అనుభవమున్న నేత రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేది జరగని పని అని అందరూ ఒప్పుకునే సత్యం. ఎందుకంటే రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేసే ప్రతి రూపాయి అప్పు అది ప్రజలపై భారంపడుతుంది. రాష్ట్ర ఖజానాకు భవిష్యత్ లో చిల్లులు పడుతుంది. అప్పుడు ఇబ్బంది పడేది పాలకులు మాత్రమే.

ఏపీ రాజకీయాలతో...
ఈ విషయం చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. రాజధాని అనేది దానంతట అది విస్తరించాలి. అవసరమైన మేరకు భవన నిర్మాణాలు చేపట్టాలి. అలాగని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పోగేసి భూములు విక్రయించుకుని చేసిన అప్పులు తిరిగి చెల్లించాలనుకోవడం లాటరీ టిక్కెట్ తగిలినట్లే. ఎందుకంటే భవనాల నిర్మాణం పూర్తయినంత మాత్రాన భూముల విలువ పెరగదు. అలాగని అంతపోసి అమరావతిలో భూములు కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారరన్నది వాస్తవం. మెడికల్ కళాశాలల విషయమే తీసుకుంటే ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు.పెట్టుబడి రూపాయి పెట్టే వారైనా తమకు రూపాయికి సేఫ్ గా ఉండాలని భావించడమే కాకుండా పది రూపాయలు తెచ్చిపెడుతుందని భావించినప్పుడే ముందుకు వస్తారు.
ఢిల్లీ వైపు చూస్తున్నా...
మరొకవైపు చంద్రబాబు ప్రస్తుతమున్నపరిస్థితిని అధిగమించడానికి ఢిల్లీవైపు చూడాల్సి వస్తుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ప్రతి విషయంలో చంద్రబాబు అడిగినంత నిధులు ఇవ్వరు. ఢిల్లీకి కాలికి బలపం కట్టుకుని చంద్రబాబు తిరుగుతున్నప్పటికీ అప్పుల్లో సడలింపులు తప్ప, గ్రాంట్ల రూపంలో రూపాయి కేంద్ర ప్రభుత్వం విదిల్చకపోవడం అందరూ గమనించాల్సిన విషయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కలలో విహరించడం మానేసి ఇలకు వచ్చివాస్తవాలను తెలుసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇదే పంథాను కొనసాగిస్తే చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశాలున్నాయన్నది వాస్తవం.మరి చంద్రబాబు వ్యవహారశైలి మారుతుందా? లేదా? అన్నది భవిష్యత్ నిర్ణయించాల్సిందే.


Tags:    

Similar News