Chandrababu : చంద్రబాబు గెలుపు ధీమా అదేనట.. అదే జరిగితే సిట్టింగ్ ల సీటు చిరిగినట్లే

తెలుగుదేశం పార్టీ తాము గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి భారీ మార్పులు చేసే అవకాశముంది

Update: 2026-02-27 08:00 GMT

తెలుగుదేశం పార్టీ తాము గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి భారీ మార్పులు చేసే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా నివేదికలను తెప్పించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్ కేవలం దీనికే పరిమితమయింది. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అందచేస్తుంది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా ఎప్పటికప్పుడు లెక్కగడుతూ ఏ ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో చంద్రబాబుకు అందచేస్తుండటంతో ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారు.

పనితీరును మదిస్తూ...
గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు పోటీ చేశాయి. ఇందులో బీజేపీ పది నియోజకవర్గాలు, జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. టీడీపీ 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ 135 నియోజకవర్గాల్లో దాదాపు సగం పైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని నివేదికలు కేంద్ర పార్టీ కార్యాలయం అందించినట్లు తెలిసింది. కేంద్ర పార్టీ కార్యాలయంతో పాటు నిఘా సంస్థలు, వివిధ ప్రయివేటు సర్వే సంస్థల నివేదికలు కూడా ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం తెప్పించుకుంటుంది. అందులో ఈ మూడేళ్లలో కొంత పనితీరు మెరుగుపర్చుకునే ఎమ్మెల్యేలను కూడా ముందుగానే అంచనా వేసి వారికి చంద్రబాబు స్వయంగా జాగ్రత్తలు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ నేతలకు...
మరొకవైపు ఓటమి పాలయిన పదకొండు నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక చంద్రబాబు ఆలోచనలు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారిని మార్చడానికి కూడా సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల జాబితాను కూడా సిద్ధం చేసి వారికి పార్టీ నుంచో, ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి ఇచ్చి జనంలోకి పంపాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేల పై వ్యతిరేకతతో ఓటమి కొని తెచ్చుకోకూడదన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ముందు నుంచే పకడ్బందీ ప్రణాళికలతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఆయన నిర్ణయాలను బట్టి అర్థమవుతంది. అదే జరిగితే చాలా మంది సిట్టింగ్ లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా అది తమకే లాభమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News