Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో ఎంత సమయం ఉండాలో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా నేడు పెరిగింది.

Update: 2026-02-27 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా నేడు పెరిగింది. శుక్రవారం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ముందుగానే అంచనా వేసినట్లుగానే శుక్రవారం రద్దీ పెరగడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నుంచి రద్దీ మొదలయి ఇటీవల వరసగా రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులకు ముందే రద్దీ పెరగడంతో వసతి గృహాలు దొరకడం కూడా భక్తులకు కష్టంగా మారింది. చాలా సేపు వసతి గృహాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారీగా తరలి రావడంతో...
తిరుమలకు ఇటీవల కాలంలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మరింత రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వేసవి కంటే ముందుగానే వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. టీటీడీ అధికారులు కూడా భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ ఉంది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,074 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,784 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News