Raghu Rama : రఘురామ ఇలాకాలో ఈ కాంట్రవర్సీలేంటి గురూ?

ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి

Update: 2026-03-28 07:20 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. సొంత పార్టీ నేతలే రఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఘటన మరవక ముందే మరొక ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. కూటమి నేతల మధ్య విభేదాలకు కారణమయింది. జిల్లాలోని ఆకివీడులో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ దాడుల వెనక కుట్ర ఉందని, కుట్రకోణాన్ని ఛేదించాలని పోలీసు శాఖను ఆయన కోరారు.

ఆకివీడులో టెన్షన్...
జిల్లాలోని ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే కూటమి నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కూటమి నాయకులపై మేకులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.
శ్రీరామ నవమి వేడుకలు...
ఆకివీడు మండలంలోని పెద్దపేటలోని శ్రీరామ నవమి వేడుకలకు నిన్న రఘురామ కృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజును కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా, మరొక వర్గం మద్దతుగా నిలుస్తుంది. రఘురామ కృష్ణరాజు మాత్రం అక్కడ ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పారు. హరిజనపేటలో రామాలయానికి తాము వ్యతిరేకమని కొందరు రఘురామ కృష్ణరాజును అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజుపై దాడికి కొందరు ప్రయత్నించారని ఒక వర్గం ఆరోపిస్తుంది.
పలువురికి గాయాలు...
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించి వేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు రాకను వ్యతిరేకించిన వర్గమే ఈ దాడికి దిగిందని కొందరు ఆరోపిస్తుండగా, ప్రత్యర్థులు తమపై దాడులు చేశారని మరొక వర్గం చెబుతోంది. అయితే రఘురామ కృష్ణరాజును అడ్డుకున్న దెవరు? ఎందుకు ఆయనపై దాడికి ప్రయత్నించారు? మరొక వర్గం ఆలోచన ఏంటి? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు ఇలాకా రెగ్యులర్ గా కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసు కేసు నమోదు...
శ్రీ రామ నవమి సందర్భంగా ఆకివీడులో జరిగిన దాడి ఘటన పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం జరిగింది. 58 మందిని ముద్దాయిగా చూపుతూ. అందులో పెట్టిన కఠినమైన సెక్షన్. 109(1) BNS. దీని ప్రకారం 10 సంవత్సరాల పైన శిక్ష ఉంటుంది. హత్యా యత్నం కింద కేసు ఇది. మరొక సెక్షన్. 308(2) BNS. దీని కింద 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. మిగిలిన సెక్షన్లు కింద రెండు అంతకన్నా తక్కువ శిక్షలు ఉంటాయి.


Tags:    

Similar News