Summer Effect : పగటి వేళ బయటకు వస్తే మటాష్.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఎండల తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా మారింది. ఉదయం పది గంటల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. ఇక పగటి వేళ ఉష్ణోగ్రతలు గరిష్టంగానే నమోదవుతున్నాయి. అయితే ఈ నెలాఖరు వరకూ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు సాయంత్రానికి మాత్రం అలా చిరుజల్లులు కురిసి వెళ్లిపోతున్నాయి.
ఏపీలో గరిష్టంగానే...
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కొంత చిరుజల్లులు పడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగానే నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎలా ఉంటుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. వీలయినంత వరకూ పగటి వేళ బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. హీట్ వేవ్స్ దెబ్బకు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. ఈరోజు తొంభయి మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలోనూ వాన.. ఎండలు...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. మార్చి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 'ఎల్లో అలర్ట్' జారీ చేస్తూ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వర్ష ప్రభావం కనిపించనుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.