Allagadda : ఆళ్లగడ్డకు వెళ్లాలంటేనే... టీడీపీ నేతలు భయపడుతున్నారా?
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలతోనే తలపడుతున్నారు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలతోనే తలపడుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు ఈ నాటివి కావు. తన తండ్రి మరణించిన నాటి నుంచి ఆయన బతికున్న సమయంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డినే శత్రువుగా చూస్తున్నారు. తమ ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి తన తండ్రి మృతి తర్వాత తమకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఏవీని టార్గెట్ చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఇద్దరూ అత్యంత సన్నిహితులు. భూమా నాగిరెడ్డి తన ఆస్తులకు బినామీగా ఏవీ సుబ్బారెడ్డిని నియమించారని అంటున్నారు.
ఏవీ వ్యాపారాలపై...
తాజాగా వరసగా ఆయన ఇంటి ప్రహరీ గోడ కూల్చివేయడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఉన్న కేబుల్ కనెక్షన్లన్నింటినీ తొలగించడంతో వివాదం మరింత రాజుకుంది. ఏవీ సుబ్బారెడ్డి కూడా తాను తగ్గేదే లేదంటున్నారు. చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు. ఏవీ సుబ్బారెడ్డి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వియ్యంకుడు. బొండా ఉమా పెద్ద కుమారుడు సిద్ధార్థ్‌తో ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతితో వివాహమయింది. దీంతో తన బలమేంటో చూపుతానని ఏవీ సుబ్బారెడ్డి ప్రతి సవాల్ విసురుతున్నారు. అయితే అఖిలప్రియ మాత్రం తాను ఏవీ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్లు చెబుతున్నారు.
ఇద్దరు మంత్రులు ....
మరొకవైపు ఆళ్లగడ్డకు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు రెండేళ్ల నుంచి రాలేదంటే వారు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నంద్యాల జిల్లాలకు చెందిన మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పటికీ ఆళ్లగడ్డలో ఇప్పటి వరకూ అడుగు పెట్టలేదు. దీనిపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది. అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటనలకు సొంత జిల్లాలకు చెందిన మంత్రులే రాకపోవడంపై పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఆళ్లగడ్డలో నెలకొన్న పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోకుంటే.. భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.