Chandrababu : చంద్రబాబు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? ఎన్నికలు ఎప్పుడొచ్చినా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో పరిస్థితి అవగతమయినట్లుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో పరిస్థితి అవగతమయినట్లుంది. కిందిస్థాయిలో క్యాడర్ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, జనంలోకి వెళ్లడానికి జంకుతున్నారన్న అభిప్రాయానికి వచ్చి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది. ఏడాది పాలన పూర్తయిన నాటి నుంచి ఇక జోరుగా హామీల అమలుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు నిన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో తన మనసులో మాట చెప్పకనే చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెళ్లినా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో స్థానాలను కూటమి సాధించాలంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఏడాది పూర్తయిన సందర్భంగా...
ఈ ఏడాది జూన్ పన్నెండో తేదీ నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఏడాది పూర్తవుతుంది. ఆరోజున లక్షమందికిపైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి తేదీలతో త్వరలో క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. ఏడాది పొడవునా ఏ ఏ హామీలు ఏ తేదీన అమలు చేయనున్నామో స్పష్టంగా ప్రజల ముందు ఉంచి వారికి ఖచ్చితమైన సమాచారం అందచేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. ఆరు నూరైనా ఆరోజు ఆ హామీని అమలు చేసేలా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. అందుకు అవసరమైన నిధులను కూడా రెడీ చేసుకునేందుకు అధికారులకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు.
మహిళల కోసం..
మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. అయితే ఏ నెల నుంచి అమలు చేస్తారరన్నదానిపై ఇంకా స్పష్టత లేకున్నా త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని జిల్లా స్థాయిలో ప్రవేశపెట్టాలని రెడీ అయిపోయినట్లే కనిపిస్తుంది. దీపం పథకం ఇచ్చే మూడు సిలిండర్లకు సంబంధించి ముందుగానే నగదును లబ్దిదారుల ఖాతాలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. సిలిండర్ బుక్ చేసుకున్నారా? లేదా? అన్నది సంబంధం లేకుండా ముందుగానే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. చాలా మందికి డబ్బులు పడటం లేదన్న ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మహిళల ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేలా ఇటు ఉచిత బస్సు పథకం, అటు దీపం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా...
మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు ఓటు బ్యాంకు కూడా పటిష్టపర్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పాక్ - భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశముందని కూడా చంద్రబాబు అనుమానిస్తున్నారు. జమిలి ఎన్నికలు 2027 లేదా 2028 లో వచ్చినా ప్రజల్లో అసంతృప్తి లేకుండా అన్ని రకాలుగా గ్రౌండ్ ను చంద్రబాబు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సారి కూటమితోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు తగినట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటునట్లే కనపడుతుంది. ఇలా చంద్రబాబు జగన్ పాదయాత్ర చేసినా తన పథకాలతో జనాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించి ఈ మేరకు ముందుకు వెళుతున్నారు.