Andhra Pradesh : జగన్ సభకు రాకపోతే.. చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు

Update: 2025-09-18 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. శాసనసభకు జగన్ హాజరు కాకుంటే చర్యలు తప్పవని, అనర్హత వేటు తప్పదని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక గ్యారంటీ అని పాలకపక్షం అంటున్న సందర్భంలో జగన్ గైర్హాజరీపై శాసనసభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరొకవైపు శాసనసభకు హాజరు కాకుండా శాసనమండలికి మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమవుతారు. మండలిలో ఎలా వ్యవహరించాలన్న దానిపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

విపక్ష వైసీపీ...
ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసనమండలిని స్థంభింప చేయాలని వైసీపీ నిర్ణయించే అవకాశముంది. అలాగే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై చర్చకు పట్టు పట్టనుంది. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడంపై శాసనమండలిలో చర్చకు పట్టుబట్టాలని జగన్ శాసనమండలి సభ్యులకు జగన్ ఆదేశించనున్నారని సమాచారం. దీంతో పాటు ఉల్లి, టమాటా రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదని, వాటికి మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం ప్రకటన చేసేలా ఒత్తిడి తేవాలని కూడా మండలి సభ్యులకు జగన్ సూచించనున్నారు. దీంతో పాటు ముఖ్యమైన సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న వ్యూహాన్ని అనుసరించాలని వైసీపీ భావిస్తుంది.
అధికార పార్టీ మాత్రం...
మరొకవైపు అధికార పార్టీ మాత్రం సూపర్ సిక్స్ హామీల అమలుతో తమ ప్రభుత్వం ఏడాదిలోనే సంక్షేమాన్ని ఎలా పరుగులు పెట్టించిందీ వివరించనున్నారు. అదే సమయంలో విపక్ష పార్టీలు చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా అనేకే అంశాల మీద చర్చ జరిగే అవకాశముంది. మెడికల్ కళాశాలలపై చంద్రబాబు శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశముంది. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల తర్వాత కొన్ని కీలక అంశాలపై చర్చించిన తర్వాత సభలో చర్చించాల్సిన అజెండాతో పాటు ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలన్న దానిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సభకు వస్తే అదరికీ తగిన సమయం ఇస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.


Tags:    

Similar News