Telangana : వరంగల్ కాంగ్రెస్ ను ఇక బాగు పర్చేదెవరు? అక్కడ నిలబడటం కష్టమేనా?

వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు చెక్ పడేటట్లు కనిపించడం లేదు.

Update: 2025-09-14 12:08 GMT

వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు చెక్ పడేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణ సంఘం ఎదుటకు అనేక సార్లు ఫిర్యాదు వెళ్లినా వరంగల్ కాంగ్రెస్ నేతల్లో మార్పు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ లో రచ్చ రోడ్డున పడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వీరిని కంట్రోల్ చేయడానికి క్రమశిక్షణ కమిటీలు కాదు కదా... ఎవరి వల్ల కూడా అయ్యేట్లు కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి రచ్చ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆ పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

భద్రకాళి పాలకమండలిపై...
వివరాల్లోకి వెళితే... ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ నేతలందరూ ఒక్కటయ్యారు. వారంతా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీనికి క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. సర్దుకుపోవాలని చెప్పింది. ఇద్దరినీ పిలిచి విచారించింది. అయినా గొడవలు సద్దుమణగ లేదు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న భద్రకాళీ ఆలయ పాలకమండలిలో సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియోజకవర్గం పరిధిలో తనకు తెలియకుండా సభ్యులను నియమించడమేంటంటూ నాయని రాజేందర్ రెడ్డి కొండా సురేఖపై మండి పడ్డారు. తాము ఏది చేసినా నడుస్తుందని భావిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
తనకు సమాచారం లేకుండా...
స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆమె పెత్తనమేంటని నిలదీశారు. దేవాదాయ శాఖ మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? అని నిలదీశారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే తాను ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో మీడియా ముందు హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నది దేనికంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పార్టీ నాయకత్వానికి నాయని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను మౌనంగా ఉంటుంటే తనను రెచ్చగొట్టేలా కొండా కుటుంబం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పెద్దలకు నాయని ఫిర్యాదు చేశారు.
అదృష్టం కొద్దీ తొలిసారి ఎమ్మెల్యే అంటూ...
దీనిపై మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఎమ్మెల్యే ను ఎన్నిసార్లు పాలకమండలికి పేర్లు పంపాలని కోరినా పంపలేదని, అందుకే తాను ఇద్దరిని నియమించారని కొండా సురేఖ చెప్పారు. అంతటితో ఆగకుండా తనకంటే నాయని రాజేందర్ రెడ్డి వయసులో చిన్నవాడని, అదృష్టం కొద్దీ తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడంటూ సెటైరిటికల్ గా మాట్లాడారు. దీనిపై నాయని రాజేందర్ రెడ్డి తిరిగి సమాధానమిస్తూ తాను పార్టీలు మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయి ఉండే వాడినంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద వరంగల్ లో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలు చల్లారేటట్లు కనిపించడం లేదు. మరి నాయకత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి.


Tags:    

Similar News