కాటారంలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాటారంలో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాటారంలో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని చూసిన స్థానికులు పొలాల్లోకి వెళ్లేందుకు భయపడిపోతున్నారు. తమ పశువుల మీద పడి దాడి చేస్తుందేమోన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. అటవీ శాఖ అధికారులు చిరుత పులిని పట్టుకోవాలంటూ గ్రామస్థులు వేడుకుంటున్నారు.
ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి...
నస్తూర్ పల్లి, వీరాపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహదేవ్ పూర్ ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తమ పెంపుడు జంతువులను కూడా పొలాల్లోకి తీసుకెళ్లవద్దని కోరారు. పులి పాదముద్రలను కూడా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.