హైదరాబాద్ మరీ అంత సేఫ్ కాదా?

Update: 2016-10-10 11:41 GMT

ప్రకృతి వైపరీత్యాల పరంగా ఒక రకమైన విపత్తు నుంచి హైదరాబాద్ సేఫ్ జోన్ అనే అభిప్రాయం ఇన్నాళ్లూ ప్రజల్లో ఉండేది. రకరకాల కారణాల రీత్యా హైదరాబాదు నగరానికిర భూకంపాల బెడద తక్కువగా ఉంటుందని.. అసలు భౌగోళికంగా హైదరాబాదు ప్రాంతానికి భూకంపాలు వచ్చే అవకాశమే లేదని.. శాస్త్రవేత్తలు గతంలో చెబుతుండే వాళ్లు. కానీ తాజా పరిణామాలు.. ఆ భరోసా మీద నీళ్లు చిలకరిస్తున్నాయి. కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ మరీ అంత సేఫ్ సిటీ కాదేమో అనే అభిప్రాయం కలిగిస్తున్నాయి. తాజాగా ఆదివారం బోరబండలో భూమి కంపించడం అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు.

ఆదివారం నాడు బోరబండ ప్రాంతంలోని గాయత్రినగర్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ప్రజలందరూ విపరీతంగా భయాందోళనలకు గురయ్యారు. అయితే చాలా స్వల్ప సమయం మాత్రమే భూమి కంపించింది. నిజానికి అది భూకంపమేనా లేదా.. భారీ ఎత్తున ఎక్కడైనా బాణసంచా పేలడం వలన ఏర్పడిందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి.

అయితే సోమవారం నాటికి శాస్త్రవేత్తలు దీన్ని భూకంపంగా నిర్ధరించారు. రిక్టర్ స్కేలు మీద ఈ భూకంపం 1.2 గా నమోదు అయినట్లు కూడా తేల్చారు. హైదరాబాదు మామూలుగా భూకంపాలనుంచి సేఫ్ జోన్ అనే అభిప్రాయం ఉండేది కాస్తా.. ఇప్పుడు కొత్త భయం స్థానికులకు ఏర్పడే పరిస్థితి. పైగా ఆదివారం భూమి కంపించిన బోరబండ గాయత్రి నగర్ ప్రాంతాలు, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలకు ఇది కారణం అవుతోంది.

Similar News