మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు భద్రతను పెంచుతున్నారు. అప్రకటింతంగానే వారికి పోలీసు భద్రత పెంచడానికి పోలీసు అధికారుల్ని ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఎన్‌కౌంటర్ తరువాత.. మావోయిస్టులు విడుదల చేసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ ద్వారా చంద్రబాబునాయుడుకు, లోకేశ్ కు మాత్రమే వారు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. వారిద్దరూ తమ నుంచి తప్పించుకోలేరంటూ మావోలు పేర్కొన్నారు.
అయితే పైకి ప్రధానంగా వారి పేర్లే ప్రస్తావించినప్పటికీ.. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుడి మీద దాడి చేయగలిగినా అది తీవ్రమైన ప్రతిస్పందన కింద చర్చల్లోకి వస్తుంది గనుక.. మావోలు అలాంటి వ్యూహం అనుసరించవచ్చునని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. రాష్ట్ర స్థాయి కీలక నాయకులు అందరికీ కూడా పోలీసు భద్రతను పెంచడమూ, లేదా మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించడమూ జరుగుతోంది.
ప్రత్యేకించి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు, సరిహద్దు జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి భయం భయంగానే ఉన్నదంటే అతిశయోక్తి కాదు.
అసలే ఇన్‌ఫార్మర్ల పేరిట పౌరుల్లోని కొందరు వ్యక్తులను కూడా అపహరించి తీసుకువెళ్లి మట్టుపెట్టే అలవాటు ఉన్న మావోలు.. ఇంత పెద్ద ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత.. తెలుగుదేశం మీద ప్రతిఘటనకు పూనుకోకుండా ఉండరని, అయితే అందుకు తాము మధ్యలో పావుల్లా బలికావాల్సి వస్తుందేమోనని సరిహద్దు ప్రాంతాల తెదేపా నాయకులు వణికిపోతున్నారు. అక్కడి వారికి ఇప్పటికే భద్రత పెంచుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మల్కన్ గిరి ఎన్ కౌంటర్ దెబ్బకి మావోల హెచ్చరికలు ఇద్దరికి వస్తే.. మొత్తం అందరు నాయకులకూ భద్రత పెంచడం జరుగుతోందని అంతా భావిస్తున్నారు.