హక్కుల సంఘాలకు కాదు.. ఆయనకు ఆవేశం వచ్చింది

Update: 2016-10-31 16:51 GMT

ఎన్‌కౌంటర్ అనే పదం వినిపిస్తే చాలు పౌరహక్కుల సంఘాలు చాలా ఆవేశంగా స్పందిస్తాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్ విషయంలో పౌర హక్కులంటూ కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు గానీ... అసదుద్దీన్ ఒవైసీకి మాత్రం తెగ కోపం వచ్చింది. భోపాల్ సెంట్రల్ జైలులో కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను హతమార్చి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుంటే.. పోలీసులు వారిని చంపేసి కట్టుకథలు చెబుతున్నారంటూ ఒవైసీ మండిపడుతుండడం విశేషం.

జైలునుంచి ఉగ్రవాదులు తప్పించుకున్న సీసీ టీవీ ఫుటేజీని కూడా అధికారులు విడుదల చేశారు. అందులో వాళ్లు దాడి చేయడమూ తప్పించుకుని వెళ్లడమూ స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదులు పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తమకున్న అనుభవం ద్వారా వారిని ట్రేస్ చేయగలిగారు... మూకుమ్మడిగా ఒకే చోట దొరికిన వాళ్లని ఎన్ కౌంటర్ చేశారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని, జైలునుంచి బయటకు రాగానే వారికి ఆయుధాలు ఎవరు సరఫరా చేశారో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు

అయితే అసదుద్దీన్ ఒవైసీకి మాత్రం ఈ వ్యవహారం మొత్తం కట్టుకథలాగానే కనిపిస్తోంది. జైల్లో ఉన్న వారికి ఆయుధాలు ఎలా వస్తాయి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ మీద ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఒవైసీ కోరుతున్నారు. ఆయన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవచ్చ నని, ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ విషయంలో మతం రంగు పులమడానికి ఒవైసీ ప్రయత్నించడం తగదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News