Chandrababu : చివరి ఓవర్ లో చంద్రబాబు వేసిన గూగ్లీకి జగన్ గింగిరాలు తిరుగుతున్నారా?

ఎన్నికలకు ఆరు రోజుల ముందు చంద్రబాబు ఇచ్చిన షాకులకు జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు

Update: 2024-05-07 05:47 GMT

ఇప్పుడు దేశమంతా క్రికెట్ ఫీవర్ అలుముకుని ఉంది. ఒకపక్క ఐపీఎల్ సీజన్ 17 ముగింపు దశకు చేరుతుండగా, త్వరలో టీ 20 వరల్డ్ కప్ కూడా ప్రారంభం కానుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కూడా ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ప్రచారానికి ముగింపు దశకు చేరుకుంది. ఆరు రోజుల ముందు చంద్రబాబు ఇచ్చిన షాకులకు జగన్ గింగిరాలు తిరుగుతున్నాడనే చెప్పాలి. ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మోదీ తన వెంట ఉన్నాడనుకుని భావించిన జగన్ కు చంద్రబాబు అండ్ కో ఇచ్చిన ఝలక్ లు మింగుడుపడటం లేదు. ఏపీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న చివరి రోజుల్లో చంద్రబాబు పై చేయి సాధించినట్లే.

ఓటు బ్యాంకు లేని...
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అస్సలు ఓటు బ్యాంకు లేదు. నోటా కంటే ఓట్లు తక్కువగా వస్తాయని తెలుసు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనవసరంగా పార్లమెంటు స్థానాలను, అసెంబ్లీ స్థానాలను ఇవ్వాల్సి వస్తుందని తెలుసు. అయినా త్యాగం చేయాలి. ఎందుకంటే ఎలక్షనీరింగ్ కోసమే. జగన్ ను తట్టుకోవాలంటే బీజేపీ అండదండలు అవసరం అని చంద్రబాబు ముందుగానే అంచనా వేసుకున్నారు. బీజేపీతో పొత్తు ప్రమాదకరమని, దాని వల్ల కొన్ని సామాజికవర్గాల ఓట్లు పోతాయని కొందరు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. నాటి నుంచే అన్ని దారుల్లో వెళ్లి మోదీతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఏమాత్రం పెద్దాయన వదులుకోలేదు.
జనసేనానిని ప్రయోగించి....
దీంతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఎటూ ఉండనే ఉన్నారు. జగన్ పై నిప్పులు చెరుగుతున్న జనసేనానిని కూడా బీజేపీతో పొత్తుకోసం ప్రయోగించారు. బీజేపీకి కూడా దక్షిణ భారత దేశంలో కొన్ని సీట్లు సొంతంగా గెలుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ అవసరమే పొత్తుకు రూట్ క్లియర్ చేసింది. సీట్ల సర్దుబాటులో కూడా ఒకింత సహనం వహిస్తూ బీజేపీని ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఓటు బ్యాంకు లేని ఆ పార్టీకి పది శాసనసభ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలు ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. కానీ ఎన్నికల ప్రక్రియలో తనకు చేదోడు వాదోడుగా ఉంటారన్న ఏకైక లక్ష్యమే టీడీపీ చీఫ్ ను తలవంచేలా చేసింది. తలవంచడానికి కారణం.. రానున్న ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనడానికే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే క్యాడర్ ఇప్పటికే భయపడిపోయి ఉన్నారు. కేసులతో సతమతమవుతున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద...
పోలింగ్ కేంద్రాల వద్ద క్యాడర్ నిలబడాలంటే కమలంతో కరచాలనం తప్పనిసరి అని ఆయన వేసిన స్కెచ్ ఎన్నికలకు ఆరు రోజుల ముందు నిజం అని రుజువువుతుంది. పథకాలను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి ఆపించగలిగారు. అదే సమయంలో వైసీపీ అనుకూలురైన అధికారులపై వేటు వేయించగలిగారు. ఇప్పటికే చంద్రబాబు ముప్ఫయి శాతం ఎన్నికలలో విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఒకింత అసహనంతో ఉన్న చంద్రబాబు మొ‍హంలో ఆనందం కనిపిస్తుందంటే దానికి జరుగుతున్న పరిణామాలే కారణమని చెప్పకతప్పదు. అధికారం తన చేతికి వచ్చినట్లేనని పెద్దాయన బలమైన ఫీలింగ్ లోకి వచ్చేసినట్లు కనపడుతుంది. మొత్తం మీద చంద్రబాబు ఐదేళ్ల క్రితం అనుకున్నది ఎన్నికలకు ఐదు రోజుల ముందు సాధ్యమవుతుండటంతో టీడీపీ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది. మరి తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News