Chandrababu : నమ్మకమే ఈ ఎన్నికల్లో అసలైన పెట్టుబడిగా మారితే మాత్రం?

చంద్రబాబు తన ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇస్తున్న హామీలు అమలు పరచాలి అంటే కనీసం ఐదు లక్షల కోట్లు పైనే కావాల్సి ఉంటుంది

Update: 2024-05-07 07:26 GMT

సీఎం అయ్యే వరకూ చంద్రబాబు వేరు.. తర్వాత వేరు.. ఆయన హావభావాలు మారిపోతాయి. భాషలో తేడా వస్తుంది. నడకలోనూ స్పష్టమైన వేరియేషన్ కనిపిస్తుంది. చంద్రబాబును దగ్గరి నుంచి చూసిన వారికి ఎవరికైనా ఇది తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఉండే చంద్రబాబును యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. గమనించి ఉంటారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు సొంతంగా గెలిచే శక్తి లేదు. ఎప్పుడు గెలిచినా ఏదో ఒక పార్టీతో కలసి నడిచి అధికారంలోకి వచ్చిన చరిత్రనే చూస్తాం. అలాంటి చంద్రబాబు మరోసారి ఇచ్చిన మ్యానిఫేస్టోను ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే .. 2014 తర్వాత చంద్రబాబును అందరూ దగ్గరుండి చూసిన వారే. ఆయన మాటలు విన్న వారే. అందుకే టీడీపీ నేతలకు లోలోపల భయం పట్టుకుందన్నది వాస్తవం.

బడ్జెట్ కు మించి...
ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు తన ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇస్తున్న హామీలు అమలు పరచాలి అంటే కనీసం ఐదు లక్షల కోట్లు పైనే కావాల్సి ఉంటుంది. ఇంతటి సొమ్మును ఎక్కడి నుంచి తెస్తారన్న అనుమానం కలిగితే మాత్రం చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కొంత ఇబ్బందులు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారంలో లేనప్పుడు మొన్నటి వరకూ ఉచితాలను వ్యతిరేకించిన చంద్రబాబు ఒక్కసారిగా తాను అధికారంలోకి రాగానే అమలు పరుస్తామని చెప్పడం పట్ల ఎక్కువ మంది లబ్దిదారులు కొంత అనుమానపు చూపులయితే చూస్తున్నారన్నది వాస్తవం. ఎందుకంటే ట్రాక్ రికార్డు చూసుకుంటే చంద్రబాబు పై నమ్మకం కంటే అపనమ్మకమే ఎక్కువ సౌండ్ వస్తుండటమే ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం చూపుతుందంటున్నారు.
కొర్రీలు ఎక్కువగా ....
చంద్రబాబు ఒకవేళ పథకాలను అమలు చేయాలని చూసినా అందులో కొర్రీలే ఎక్కువగా ఉంటాయన్న అనుమానం కూడా లేకపోలేదు. లబ్ది దారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు ఇప్పుడు చెప్పిన మ్యానిఫేస్టో ప్రకారం అమలు చేయరని, ఏదో ఒక తిరకాసు పెట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గించడం గ్యారంటీ అన్న సందేహం అందిరిలోనూ నెలకొంది. పొరుగు రాష్ట్రంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం, లబ్దిదారులను కుదించడం వంటి వాటిని వైసీపీ నేతలు జనంలోకి బాగానే తీసుకెళుతున్నారు. ఇల్లు ఉందనో.. పట్టా భూమి ఉందనో లబ్దిదారుల జాబితాలో కోత పెట్టే అవకాశముందన్న అంచనాలతో చాలా మంది లబ్దిదారులు ఇప్పుడు చంద్రబాబు మ్యానిఫేస్టో ఆకట్టుకునే అంశాలున్నప్పటికీ అటువైపు చూడటం వృధా అన్న ధోరణికి వచ్చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. గత ప్రభుత్వం తనకు అప్పులు మిగిల్చిందని ఆయనిచ్చిన హామీలు పక్కన పెట్టే అవకాశాలున్నాయంటున్నారు.
బీజేపీతో పొత్తుతో...
ఇక ధరలు పెంచరన్న గ్యారంటీ కూడా ఏమీ ఉండదన్న అభిప్రాయం నెలకొంది. చంద్రబాబు సంస్కరణలకు పెద్దపీట వేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే అనేక ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న హామీ అన్న దానిపై ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనలో ఉన్నారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆర్టీసీని తిరిగి ప్రయివేటు పరం చేయరన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న వారిలో మొదలయింది. అదే సమయంలో విజన్ అంటూ తమకు అందే పథకాలకు ఎసరు పెట్టే అవకాశముందని కూడా అనుమానిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. చంద్రబాబు ఇలా ఫ్రీ పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించదన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఎంత మేరకు నమ్ముతారన్నది అనుమానంగానే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే ఈ ఎన్నికలలో చంద్రబాబు మ్యానిఫేస్టోలో ఎంతగా ప్రయోజనాలు చేకూరుస్తానని చెప్పినా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం ఉంటుందన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగానే చూడాలంటున్నారు.


Tags:    

Similar News