Ap Politics : కేసీఆర్ కు ధరణి భారమయింది... జగన్ కు "ల్యాండ్" ప్రాబ్లెం కానుందా?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది.

Update: 2024-05-06 04:03 GMT

తెలంగాణ ఎన్నికలకు, ఏపీ ఎన్నికలకు పోల్చి చూడటం సర్వసాధారణం. సంక్షేమ పథకాలను అమలు పర్చినా కేసీఆర్ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా.. చివరకు దళితబంధు కింద పది లక్ష రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందచేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అందుకు అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్పాలి. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణమని చెప్పాలి.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై...
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాన్నే భుజానకెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేసింది. ఎంతవరకూ అంటే చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకూ ప్రతి మీటింగ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెబుతూ ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇంతటితో ఆగకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ప్రచారం చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కేసు నమోదు చేసేింది. అంతవరకూ ఓకే గాని... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతుల్లో కొంత ఆందోళన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కనపడుతుందన్నది వాస్తవం.
అసెంబ్లీ లో బిల్లు పెట్టినప్పుడు...
దీంతో అధికార వైసీపీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. 2019 లో తాము తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఆమోదించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భూములకు మరింత భద్రతను తేవడానికే ఈ యాక్టును తెచ్చామని వైసీపీ చెబుతుంది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అసెంబ్లీలో ఆమోదించామని, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పట్టాదారు పాస్ పుస్తకాలపై...
ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తెచ్చి భూములను తమ పరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వెళుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడిపోయిందనే చెప్పాలి. కేసీఆర్ కు తెలంగాణలో ధరణి వల్ల జరిగిన నష్టం తరహాలోనే తమకు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం చేకూరుస్తుందేమోనన్న ఆందోళన వారిలోనయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి రైతులు నమ్ముతారా? నమ్మరా? అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందే.


Tags:    

Similar News