Ys Jagan : జగన్ లో బేలతనం.. చివరి క్షణంలో షాకిస్తారని ఊహించలేదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు ఆయన డీలా పడ్డారు.

Update: 2024-05-06 13:42 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు ఆయన డీలా పడ్డారు. బేలతనం కనిపిస్తుంది. గత ఐదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా సహకరించినందుకు తనపైకి దూకుడుగా రారని జగన్ భావించారు. కాని నిన్నటి మొన్నటి వరకూ సీన్ అలాగే కనిపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారింది. మొదట్లో మోదీ ఏపీకి వచ్చి కూటమి సభలో మాట్లాడినప్పుడు కూడా జగన్ పేరు ఎత్తకుండా ఆయన వెళ్లిపోయారు. దీంతో జగన్ లో తనకు లోపాయికారీగా బీజేపీ సహకరిస్తుందని ఆశపడ్డారు. అదే నిజమని నమ్మారు. చివరి వరకూ అంతే జరుగుతుందని భావించారు.

షా వచ్చిన తర్వాతనే...
కానీ నిన్న అనంతపురం జిల్లాకు అమిత్ షా వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అమిత్ షా వచ్చి వెళ్లిన వెంటనే రాష్ట్ర డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇది జగన్ ఊహించని పరిణామమే. ఇంకా ఎన్నికలకు వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు పుష్కలంగా సహకారం లభిస్తుందని భావించిన జగన్ డీజీపీ పై బదిలీ వేటుతో కంగుతిన్నారు. బీజేపీ నేతలను ఒప్పించడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంద్రీశ్వర్ సక్సెస్ అయ్యారనే ఆయన భావిస్తున్నారు. అధికారులను మార్చి వేసి ఎన్నికల ప్రక్రియను సక్రమంగా కాకుండా తమకు అనుకూలంగా జరుపుకోవడానికి ప్లాన్ వేసినట్లు కనపడుతుందని ఆయన భావిస్తూ ఒకింత తొట్రుపాటుతో ఉన్నట్లు కనిపించింది. మోదీ కూడా ఈరోజు తనపైనా, తన ప్రభుత్వంపైన ఆరోపణలు చేయడం కూడా అందులో భాగమేనని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
నిరాశలో జగన్...
అందుకే ఈరోజు మచిలీపట్నం సభలో వైఎస్ జగన్ ఓపెన్ అయిపోయారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతుందని వైఎస్ జగన్ అన్నారు. ఇష్టమొచ్చినట్లు అధికారులను మార్చేస్తున్నారన్నారు. కావాలనే ప్రజలకు పథకాలకు అందకుండా చేస్తున్నారన్నారు. ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన నిధులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు మంచిజరుగకుండా ఉండేందుకే ఇన్ని కుట్రలు జరుగుతున్నట్లు అర్థమవుతుందని అన్నారు. జగన్ ఇలా అన్నారంటే ఆయనలో ఒకింత నిరాశ ఆవరించినట్లే అనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తనపై యుద్ధాన్ని ప్రకటించిందని ఆయన భావిస్తున్నారు. మొన్నటి వరకూ వివిధ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా జగన్ మరోసారి మోదీ అధికారంలోకి వస్తారని చెప్పారు. అందుకు కారణం తన జోలికి రారనే కావచ్చు.
తెలంగాణలో మాత్రం...
ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిధుల విడుదలకు నో చెప్పింది. తుఫాను కారణంగా రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ఇచ్చే నిధులను కూడా విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పొరుగున ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఎన్నికల సంఘం రైతు భరోసా నిధుల విడుదలకు అనుమతిచ్చింది. పంట నష్ట పరిహారం నిధుల విడుదలకు కూడా అనుమతిచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆన్ గోయింగ్ పథకాలను కూడా నిలిపేయాలని ఆదేశించడం అంటే తమను వెంటాడుతున్నట్లే అనిపిస్తుందన్న ధోరణిలో జగన్ మాట్లాడుతుండటం ఆయనలో బేలతనాన్ని సూచిస్తుంది.


Tags:    

Similar News