స్వర్ణ కిరీట ధారిణిగా భద్రకాళి

Update: 2016-10-09 06:59 GMT

తెలంగాణ జనజీవనంలో , సంస్క్రుతిలో , సాంప్రదాయంలో విశిష్టమైన స్థానం కలిగి ఉన్న ప్రత్యేకించి కాకతీయుల సామ్రాజ్య విస్తరణలో రుద్రమదేవి జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉన్న వరంగల్ లోని భ్రదకాళి అమ్మవారు ... ఇప్పుడు స్వర్ణ కిరీట ధారిణిగా అలరారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అనే స్వప్నాన్ని సాకారం చేసినందుకు అప్పట్లో తెలంగాణ సాధనకు ఉద్యమిస్తున్న యోధుడిగా కేసీఆర్ పలువురు దేవుళ్లకు మొక్కారు. ఆ మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా ఇప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారికి 11.7 కిలోల బరువైన స్వర్ణకిరీటాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయించి, కానుకగా సమర్పించారు. దీని మొత్తం ఖరీదు 3.7 కోట్ల రూపాయలు.

భద్రకాళి అమ్మకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. కాకతీయ రాజుల ఇలవేల్పుగా అమ్మవారిని చెప్పకుంటారు. రుద్రమదేవి కూడా ప్రతిరోజూ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చి పూజాదికాలు నిర్వహించిన తర్వాతే దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్లేదని చారిత్రక ఆధారాలు చెబుతుంటాయి. అలా భక్తుల్లో ఎంతో విశ్వాసాన్ని ప్రోది చేసుకున్న భద్రకాళి అమ్మకు కేసీఆర్ సర్కారు వారి తరఫున ఇన్నాళ్లకు మొక్కు చెల్లించారు.

ఆదివారం వరంగల్ ఆలయంలో కేసీఆర్ దంపతులు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఈ లాంఛనం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు అనేక మంది పాల్గొన్నరు.

Similar News