పరిపాలన మరియు సంక్షేమం పరంగా అద్భుతాలు సృష్టించే ఉద్దేశంతోనే చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది తప్ప.. ఇందులో మరో ఉద్దేశం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేకే కమిటీ జిల్లాలను ఫైనలైజ్ చేసిందని, దానికి చట్టబద్ధత లేదని అంటున్న విపక్షాలు గత ఏడాదిలోనే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటుచేసి కసరత్తు చేసిన సంగతిని గుర్తు తెచ్చుకోవాలని కేసీఆర్ హితవు చెప్పారు.
చిన్న జిల్లాల విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కేసీఆర్ హెచ్చరించారు. జిల్లాల ఏర్పాటు తాము చాలా శాస్త్రీయమైన పద్ధతిలో చేపట్టామని కేసీఆర్ అన్నారు. తాము ఏం చేసినా తప్పు అనడం విపక్షాలకు అలవాటుగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.
అలాగే సీపీఎం నాయకులు తెలంగాణలో జరుపుతున్న మహా పాదయాత్ర మీద కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో జనం యావత్తూ తెరాస మీద అభిమానం పెంచుకుంటూ ఉండగా.. తతిమ్మా అన్ని పార్టీలు తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. సీపీఎం నాయకులకు అసలు తెలంగాణలో యాత్రల పేరిట తిరిగే హక్కులేదని చెప్పారు. ఈ పాదయాత్రలో సీపీఎం నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి.. ఎందుకు యాత్ర చేస్తున్నారో అడగాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
సెక్రటేరియేట్ మార్పు తథ్యం..
ప్రస్తుతం ఉన్న సెక్రటేరియేట్ భవనాన్ని మార్చి కొత్త భవనం నిర్మించాలనే ఆలోచనను కూడా కేసీఆర్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియేట్ చాలా అసౌకర్యంగా ఉన్నదని, 60 ఏళ్ల పాలనలో వారు చేయలేదు, ఇప్పుడు చేసే వాళ్లని కూడా చేయనివ్వకుండా అడ్డు పడుతున్నారు అంటూ కేసీఆర్ దెప్పి పొడిచారు.