విట్ : అమరావతిలో మరో కొబ్బరికాయ పగిలింది

Update: 2016-11-03 08:55 GMT

అమరావతిలో విట్ యూనివర్సిటీకి గురువారం శంకుస్థాపన జరిగింది. అమరావతిలో రాజధాని ప్రాంతం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న ఈ తొలి ప్రెవేటు వర్సిటీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్ ద్వారా ఏటా 32వేల మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తారు. విట్ చాలా ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం వెనుక ఉన్న కృషి మొత్తం చంద్రబాబునాయుడుదేనని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. వెలగపూడి సచివాలయ భవనాలను కూడా పరిశీలించిన వెంకయ్యనాయుడు.. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత చక్కటి సెక్రటేరియట్ ను నిర్మించినందుకు కూడా అభినందించారు.

నిజానికి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటగా ముందుకు వచ్చిన సంస్థ విట్. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. విట్ యూనివర్సిటీ వీసీ విశ్వనాధం అప్పట్లోనే తనను సంప్రదించి, ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.

మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి ఒకదాని వెంట ఒకటి శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కోర్ కేపిటల్ కేంద్ర సర్కారు నిధులతోనే పూర్తిగా రూపుదిద్దుకోనుంది. జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఏడు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పుడు ప్రెవేటు వర్సిటీ విట్ కు శంకుస్థాపన జరిగింది. వారు తమ సొంత నిధులతో నిర్మాణాలు ప్రారంభిస్తారు. మరి కొన్ని నెలల తర్వాత.. నిర్మాణాలకు ప్రాథమికమైన రూపు కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు. అంతవరకు నిర్మాణాల్లో చురుకుదనం కనిపించినా ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తున్నట్లే అని పలువురు భావిస్తున్నారు.

Similar News