రెచ్చగొట్టే వంకరబుద్ది మారలేదు

Update: 2016-10-10 23:10 GMT

పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి అలాగే కొనసాగుతోంది. హద్దులో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు, మన సైన్యం అడ్డుకోవడాలు కాల్పులు జరిపి మట్టుపెట్టడం లాంటి సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక వైపు స్వదేశంలో ఈ సరిహద్దు ఉద్రిక్త సంక్లిష్ట పరిస్థితుల్ని రాజకీయ మైలేజీకి వాడుకోవాలని చూసే నాయకులు ఎక్కువ అవుతుండగా, మరోవైపు పాకిస్తాన్ నుంచి రెచ్చగొట్టే చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

భారత్‌కు కీడు తలపెడుతున్న ఉగ్రవాదులను కీర్తించి వారిని నెత్తిన పెట్టుకోవడం ద్వారా భారతసైన్యంలో ఉద్రేకాలను రెచ్చగొట్టడం అనేది పాకిస్తాన్ ధోరణిగా కనిపిస్తోంది. అక్కడి పార్లమెంటు సమావేశాల్లో సైతం భారతసైన్యం మట్టుపెట్టిన ఉగ్రవాదుల్ని హీరోలుగా ప్రస్తావిస్తూ.. ప్రసంగాలు సాగించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అలాంటి దుశ్చర్యకే తెగబడుతున్నారు.

భారత్‌లో అస్థిర సృష్టించేందుకు కుట్రలు పన్నుతూ ఇక్కడి యువతను మిలిటెంట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బుర్హాన్ నవీని షరీఫ్ ఇప్పటికీ హీరోగానే అభివర్ణిస్తుండడం విశేషం. అతడిని స్వాతంత్ర్య సమర యోధుడిగా పేర్కొంటూ.. నవీని కశ్మీరీ ప్రజల గర్వకారణంగా షరీఫ్ పేర్కొనడం రెచ్చగొట్టేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాశ్మీర్ ప్రయోజనాలు కాపాడడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందని, వారి స్వాతంత్ర్య పోరాటానికి తాము మద్దతివ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోజాలదనీ నవాజ్ షరీఫ్ అనడం పాక్ బుద్ధులకు పరాకాష్ట అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News