యూపీ సంక్షోభంతో తెలుగు విపక్షాలు మురుస్తున్నాయ్!

Update: 2016-10-26 04:19 GMT

యూపీలో అధికార పీఠం మీద కుటుంబ పెత్తనం శృతి మించిపోవడం అనేది ఎన్ని రకాల విపరిణామాలకు దారితీసిందో చూస్తూనే ఉన్నాం. కొన్నిరోజుల పాటూ నడిచిన హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అయితే తాజా ట్విస్టు ఏంటంటే.. యూపీలో కుటుంబ పాలన పర్యవసానంగా వచ్చిన పరిణామాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు మురిసిపోతున్నాయి.

అఖిలేష్ గద్దె ఎక్కిన సమయంలో లోకేష్ ను అఖిలేష్ తో పోలుస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి. నవతరం వ్యూహచాతుర్యంతోనే అఖిలేష్ తన ప్రతిభను ప్రదర్శించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడని కీర్తించాయి. ఇక్కడ తెలుగుదేశంలో కూడా అదే తరహాలో లోకేష్ పార్టీకి కొత్త జవసత్వాలు తెస్తున్నాడని చాటుకున్నాయి. ఆ దృష్టాంతాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో అఖిలేష్ తో లోకేష్ ను పోల్చారే.. ఇప్పుడు అదే తరహా తండ్రితో విభేదించి పార్టీలో ముసలం పుట్టించే పని చేస్తారా అంటూ వైకాపా శ్రేణులు అక్కడక్కడా చర్చకు పెడుతున్నారు.

తెలంగాణలో కూడా విపక్షాలకు అదే పనిగా ఉంది. యూపీలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం వంటిది తెలంగాణలో కూడా సిద్ధంగా ఉన్నదని.. నేడో రేపో తెరాసలో ముసలం పుడుతుందని భాజపా నాయకులు, కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెరాస పార్టీ మీద పెత్తనం ఉన్న కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేటు చేస్తాయనేది వారి వాదనగా ఉంది.

ఇలాంటి విమర్శలు వాదనల వల్ల ఒరిగేది జరిగేది ఏమీ లేదు కానీ.. అక్కడి సంక్షోభానికి ముడిపెట్టి.. ఇక్కడి పాలక పక్షాల మీద ఏదో కాసింత బురద జల్లి విపక్షాలు తృప్తి పడడానికి మాత్రం ఇది ఉపయోగపడుతోంది.

Similar News