మోదీ వ్యతిరేకులకు కిక్ ఇస్తున్న పాకిస్తాన్

Update: 2016-10-11 01:56 GMT

ఇక్కడ మోదీని గద్దె దించాలని నిత్యం తపించిపోతున్న వారెవరైనా ఉన్నారా? అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ల ముందు వరుసలో వస్తారు. సర్జికల్ దాడులు అనే అంశాన్ని వాడుకుని.. అటు మోదీ సర్కారు మీద బురద చల్లడానికి వారు తమ శక్తివంచన లేకుండా పాటు పడుతున్నారు. మోదీ రాజకీయ కక్కుర్తితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలనే డిమాండ్‌ను వారెంతగా తెరమీదికి తెస్తున్నారో మనకు తెలుసు. ఒక కోణంలోంచి పరిశీలించినప్పుడు వీళ్లు భారతదేశానికి చెందిన నాయకులేనా? పాకిస్తాన్ నాయకులా? అని అనుమానం కలిగేంతగా.. పాక్ కు నైతిక మద్దతు కలిగించేలా.. వీరు సర్జికల్ దాడుల గురించి.. ఆధారాలు చూపించాలంటూ రగడలు చేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే మోదీ పాలన అంతమైపోవాలని అభిలషించే వీరికి వీనుల విందుగా ఇప్పుడు పాకిస్తాన్ పెద్దలు కూడా విమర్శలు చేస్తుండడం విశేం.

పాక్ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ ఆసియాలో శాంతి నెలకొనాలంటే ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు కుదరదని వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా గమనించాలి. దక్షిణ ఆసియాలో శాంతి వెల్లి విరియాలంటే భారత్ పాకిస్తాన్ భాయీ భాయీలా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.

అదే సమయంలో సర్తాజ్ మాటలు నోటితో పొగడుతూ.. నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న వైనం కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే.. ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలకు తాము సహకరిస్తాం.. లాంటి పడికట్టు మాటలు వల్లిస్తూనే.. కాశ్మీర్ విషయంలో తమ విధానం మారలేదని, అక్కడ స్వాతంత్ర్య పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని సర్తాజ్ పేర్కొనడం ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యవహారమే. కాకపోతే.. శాంతి వెల్లివిరియడానికి మోదీ అడ్డం ఉన్నారంటూ నిందలు మొత్తం ఆయన మీద వేసేసి, ఆయన ప్రధానిగా లేకుండా పదవిలోంచి దిగిపోతే ఇరు దేశాల సంబంధాలు బాగుంటాయని పాకిస్తాన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు.. స్వదేశంలోని మోదీ శతృవులకు మహా రుచిగా ఉంటాయనడంలో సందేహం లేదు.

Similar News