భారతీయ లిక్కర్ కింగ్ గా మొన్నమొన్నటివరకు తిరుగులేని ఇమేజితో చెలరేగుతూ ఉండినటువంటి విజయమాల్యా మీద ఢిల్లీ కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయన మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం భారతీయ చట్టాల మీద ఆమాత్రం గౌరవం లేదా? అంటూ విజయమాల్యా వ్యవహార సరళిని నిలదీయడం విశేషం. న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది.
ఫెరా చట్టాల ఉల్లంఘన కేసును విచారిస్తున్న పాటియాలా హౌజ్ కోర్టు ప్రస్తుతం విదేశాలకు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్న విజయమాల్యాకు తిరిగి భారత్ కు వచ్చే ఉద్దేశం ఉన్నట్లుగా లేదని వ్యాఖ్యానిస్తూ ఈ నాన్ బెయిలబుల్ వారంటు ఇవ్వడం విశేషం. ఇప్పటికే పలుమార్లు నోటీసులు, ఆదేశాలు ఇచ్చామని అయినా మాల్యా పట్టించుకోవడం లేదంటూ.. ఆయనకు చట్టాలపై గౌరవం లేదని ఆగ్రహించింది. అదే సమయంలో 2012లో చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి మరో కేసులో కూడా మాల్యా పేరిట మరొక నాన్ బెయిలబుల్ వారంటును కోర్టు జారీచేసింది.
విజయమాల్యా ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ వారంట్ల నేపథ్యంలో పోలీసులు స్వదేశానికి ఎలా తీసుకువస్తారో చూడాలి.