గాలి జనార్దనరెడ్డి ఎంత గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపిస్తున్నప్పటికీ.. ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడిపోతూనే ఉన్నది. తాజాగా ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డారు. బళ్లారి కేంద్రంగా గాలి జనార్దనరెడ్డి దాదాపు వంద కోట్ల రూపాయల నల్లధనాన్ని బ్యాంకు అధికారులకు 20 శాతం కమిషన్లు ఇవ్వడం ద్వారా కొత్తనోట్లుగా మార్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దళారీల ద్వారా ఈ వ్యవహారం నడిపించారని తెలుస్తోంది. గాలి జనార్దనరెడ్డి ఎంతో రహస్యంగా ఈ వ్యవహారం నడిపించినా.. అది రట్టయింది.
అయితే అనుకోని కోణంలో ఇది వెలుగుచూడడం విశేషం. దళారీలను ఆశ్రయించిన గాలి బృందం.. ఓ రెవిన్యూ అధికారి డ్రైవరు ద్వారా వచ్చిన సొమ్ములో నోట్లు కొన్ని తగ్గాయంటూ.. గాలి జనార్దనరెడ్డి మనుషులు బెదిరించారుట. భయపడిపోయిన సదరు రెవిన్యూ అధికారి డ్రైవరు రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో.. గాలి కోటరీ బెదిరింపుల గురించి విపులంగా పేర్కొన్నాడుట.
అతడి మరణం తర్వాత లేఖ ద్వారా గాలి పాల్పడిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. గాలి జనార్దనరెడ్డి మెడకు మరో ఉచ్చు తగులుకున్నట్లు అయింది. అసలే ఆయన అనేక రకాల కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ బెయిల్ పై గడుపుతున్నారు. ఇటీవల కూతురు పెళ్లి ఖర్చు విషయంలో ఐటీ అధికారుల దాడులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ నల్లధనం మార్పిడి వ్యవహారం మరో చికాకు అవుతుందని అంతా అనుకుంటున్నారు.