కేసీఆర్ సర్కారుకు ఊపిరాడనివ్వకుండా విమర్శలతో విరుచుకుపడడంలో తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. ఎడాపెడా విమర్శలు చేసేయడం మాత్రమే కాదు.. చాన్సు దొరికినప్పుడెల్లా ఆందోళనలతో ముందుకెళుతున్నారు. మొన్నమొన్నటివరకు రైతుపోరుబాట పేరుతో జయశంకర్ జిల్లా నుంచి తన నియోజకవర్గం వరకు యాత్ర చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆయన ఇప్పుడు మరో బాటను ఎంచుకున్నాడు. కేసీఆర్ సర్కారు మీద సమరం ప్రకటించడానికి విద్యార్థి పోరుబాటను 9 వ తేదీనుంచి ప్రారంభిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 16వ తేదీనుంచి జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంట్ అనేదే ఎక్కువ తీవ్రమైన అంశంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల నుంచి అనేక దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్నే ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. విద్యార్థి పోరుబాట పేరుతో రాష్ట్రంలో పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే రేవంత్ యాత్ర పట్ల పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గతంలో రైతు పోరుబాట చేసినప్పుడు కూడా.. ఒక వర్గాన్ని మాత్రమే కలుపుకుపోయాడని.. జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు.. సొంత పార్టీలో మిగిలిన నాయకులే కొద్ది మంది అయితే.. వారిలో కూడా కొందరిని దూరం పెట్టారని ఆరోపణలున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు.. అన్ని వర్గాలను కలుపుకుపోయేలా ఉద్యమాలు ఉంటేనే పార్టీకి లాభం జరుగుతుందని అంటున్నారు. ఈ విషయమై అప్పట్లో నారా చంద్రబాబునాయుడుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈసారి విద్యార్థి పోరుబాట విషయంలో రేవంత్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.