భుజాలు తడుముకున్నదే కాక, దబాయిస్తున్నారు!

Update: 2016-12-07 10:10 GMT

గుమ్మడికాయల దొంగ అనగానే.. ఎవరైనా భుజాలు తడుముకుంటే అది వారి ఉలికిపాటు అంతే! వేరే వ్యక్తి అసలు దొంగ అని తేలిన తర్వాత.. భుజాలు తడుముకున్న వారు.. ‘ఆరోజు మమ్మల్ని అన్నారే’ అని ఎదురుదాడికి దిగితే.. దాన్ని ఏమని చెప్పాలి? ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇది కాదు గానీ.. ఆ తరహాలో ఇదొక చిత్రమైన పరిణామం అంతే. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట నాయకులు అదే పనిచేస్తున్నారు.

నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకంలో హైదరాబాదులో ఓ వ్యక్తి పదివేల కోట్ల నల్లధనం లెక్క చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. వాటిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. పదివేల కోట్ల నల్లధనం అంటే.. ఏం వ్యాపారాలు చేసి సంపాదించారో.. ఎలా చేశారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చింది. ఆ మాటలు జగన్ ను ఉద్దేశించే అన్నట్లుగా వారు ఉడుక్కున్నారు. మా జగన్ మీద నిందలేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. నిజానికి అందులో జగన్ ను అన్నమాటలేమీ లేవు. ఆ అంశం మీద వైకాపా, తెదేపా నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.

ఇప్పుడు సదరు పదివేల కోట్లు బాణాపురం లక్ష్మణరావు అనే వ్యక్తి వెల్లడించినట్లుగా తేటతెల్లం అయింది. అదొక ప్రహసనం నడుస్తోంది. అరే.. అప్పుడు అనవసరంగా భుజాలు తడుముకున్నామే అని వైకాపా నాయకులు మౌనం గా ఉంటే సరిపోయేది. కానీ.. వారు .. అప్పుడు మామీద నిందలు వేశారు.. అంటూ ఆ అంశాన్ని తిరగతోడుతున్నారు. దీంతో జగన్ అక్రమార్జనల గురించి అనవసరంగా మళ్లీ ప్రజల్లో కాసేపు చర్చ జరగడం తప్ప.. ఇలా మానిన గాయాన్ని కెలుక్కోవడం వల్ల దక్కేదేమీ ఉండదని వైకాపా నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది.

Similar News