భారత్‌లో ఐసిస్ దాడులు : హెచ్చరిస్తున్న అమెరికా

Update: 2016-11-02 05:10 GMT

భారత్ లో విలయం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అగ్రరాజ్యం అమెరికా కు సమాచారం అందింది. దీనికి సంబంధించి అమెరికా అప్రమత్తం అయింది. భారత్ లో దాడులు జరుగుతాయనే నిఘావర్గాల సమాచార నేపథ్యంలో, ఇక్కడి అమెరికన్ ఎంబసీ ద్వారా తమ దేశానికి చెందిన పౌరులందరికీ వారు హెచ్చరికలు పంపుతున్నారు.

భారత్ లో ఉన్న అమెరికన్లు అందరికీ అమెరికన్ ఎంబసీ హెచ్చరికలు పంపింది. ఏ నగరంలోనైనా ఐసిస్ దాడులు జరిగే అవకాశం ఉన్నదని... కొన్నాళ్లపాటూ రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా మెలగాలని, వీలైనంత వరకు మెగా కాంప్లెక్సులకు వెళ్లకుండా ఉండాలని, రద్దీ వేళల్లో వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది.

భారత్ కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉండడం ఇవాళ కొత్త విషయం కాదు.. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ తో సరిహద్దుల్లో చెలరేగుతున్న రోజువారీ కాల్పుల నేపథ్యం, ప్రత్యేకించి, 8 మంది సిమి ఉగ్రవాదుల మూకుమ్మడి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఐసిస్ ప్రతిచర్యలు తీవ్రంగా ఉండచ్చునని అమెరికా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

సిమి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో , మామూలుగా దేశంలో సిమి కార్యకలాపాల జాడలు గతంలో బయటపడిన అన్ని రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసు వర్గాలు అప్రమత్తం అయ్యాయి. అయితే ఐసిస్ దాడులకు తెగబడవచ్చుననే తాజా అమెరికా సమాచారమే ఆందోళన కలిగిస్తోంది.

Similar News