కివీస్‌కు మూడో టెస్టులో కూడా గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. తొలి రెండు రోజుల్లో వీరబీభత్సంగా బ్యాటింగ్ చేసిన భారత్.. 557 పరుగుల అతి భారీ తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచి 5 వికెట్ల నష్టం వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ వికెట్లేమీ నష్టపోకుండా 9 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే చేసింది. మూడోరోజు ఆటలో మన భారత బౌలర్లు పిచ్ ను ఎలా తమకు అనుకూలంగా వాడుకుంటారనే దాన్ని బట్టి మ్యాచ్ పలితం డిసైడ్ అవుతుంది.
రెండో రోజు ఆట ఆద్యంతం ఉత్సాహభరితంగా, క్రికెట్ ప్రియులకు కిక్ ఇచ్చేలా సాగడం విశేషం. తొలిరోజు 79 పరుగుల స్కోరు వద్ద ఆగిన ఆజింక్య ర హానే ఆదివారం తొలి సెషన్ లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత దూకుడు మరింత పెంచి.. డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు గానీ.. ఆ టార్గెట్ అందుకోడానికి ఇంకా 12 పరుగుల దూరం ఉందనగా.. బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్అవుట్ అయ్యాడు. ఈలోగా రెండో రోజు కూడా తన జోరు కొనసాగిస్తూ టెస్టులో తన అపురూపమైన రెండో డబుల్ సెంచరీ ని నమోదు చేసిన కెప్టెన్ విరాట్ కొహ్లి.. పటేల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో రోహిత్ శర్మ 63 బంతుల్లోనే 51 పరుగులు చేసి వేగంగా స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేశాడు. చివరికి 557 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజీల్యాండ్ చాలా నింపాదిగా, జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రారంభించింది. 9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్లే మీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో దక్కిన పరాజయాలతో పోల్చుకున్నప్పుడు.. మూడో రోజు ఆటలో న్యూజీలాండ్ పూర్తిగా వికెట్లను కాపాడుకోవడం మీదనే దృష్టి పెడుతుందని అనుకోవచ్చు. వారిని ఫాలో ఆన్ ఆడించే పరిస్థితి తీసుకువస్తే.. భారత్‌కు విజయం దక్కవచ్చు.